Telugu News » Congress : బీఆర్ఎస్ వల్ల రాష్ట్రం చాలా వెనక్కు పోయింది.. పొంగులేటి..!!

Congress : బీఆర్ఎస్ వల్ల రాష్ట్రం చాలా వెనక్కు పోయింది.. పొంగులేటి..!!

అనవసర వివాదాలకు వెళ్ళకుండా రెండు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, జగన్మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం విదితమే.

by Venu

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి.. ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికి ఇంద్రకీలాద్రిపై అమ్మ వారి దర్శనం చేయించారు. అనంతరం మంత్రికి అర్చకులు ఆశీర్వాదాలతో పాటు తీర్ధప్రసాదాలను అందజేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మొక్కు చెల్లించుకోవడానికి వచ్చానని పొంగులేటి తెలిపారు..

మరోవైపు గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం పై పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు చేశారు.. చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించానని చెప్పుకుంటూ.. రాష్ట్రాన్ని 10ఏళ్లు పాలించిన కేసీఆర్ (KCR).. అభివృద్ధి పేరుతో 5లక్షల కోట్ల అప్పులు తెలంగాణ ప్రజల మీద పెట్టారని ఫైర్ అయ్యారు. కమిషన్లు లేనిదే పనులు జరగని ప్రభుత్వంగా పేరుతెచ్చుకొన్న బీఆర్ఎస్ వల్ల రాష్ట్రం చాలా వెనక్కు పోయిందని పొంగులేటి ఆరోపించారు.

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఇచ్చిన 6గ్యారెంటీ హామీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని తెలిపిన పొంగులేటి.. ఏపీ సీఎం జగన్ కి తనకి మధ్య ఉన్న రిలేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌ కి నాకు మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరు అని స్పష్టం చేశారు. విభజన సమస్యలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయంతో పరిష్కరించుకుంటాయని పొంగులేటి వెల్లడించారు.

అనవసర వివాదాలకు వెళ్ళకుండా రెండు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, జగన్మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం విదితమే.. గతంలో పొంగులేటి ఆ పార్టీ నుంచి ఎంపీగా కూడా పనిచేశారు.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి.. అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారు.

You may also like

Leave a Comment