తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చింది. తర్వాత ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. కాగా ప్రస్తుత ప్రగతి భవన్ కాస్త జ్యోతి రావు పూలే ప్రజా భవన్ గా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌ను కేటాయించింది.
ఈ క్రమంలో భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) దంపతులు ఈ రోజు గృహ ప్రవేశం చేశారు. నేటి ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో (Praja Bhavan)కి అడుగుపెట్టారు. గృహ ప్రవేశం అనంతరం భట్టి దంపతులు అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమం కూడా చేయించారు భట్టి దంపతులు..
మరోవైపు బీఆర్ఎస్ (BRS) పాలనలో ప్రగతి భవన్ రాచరికానికి చిహ్నంగా ఉందంటూ గతంలో ఎన్నో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. రేవంత్ కూడా ఈ విషయాన్ని ఎన్నోసార్లు ప్రస్తావించారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా.. ప్రగతి భవన్ పేరు మార్చారు. ప్రస్తుతం ప్రజాభవన్ ను డిప్యూటీ సీఎం నివాసం కోసం అప్పగిస్తున్నట్లు బుధవారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిసింది. సువిశాల స్థలంలో ఉన్న ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనంలో నివాసం ఉండేందుకు సకల సదుపాయాలు ఉండటం, భద్రతాపరంగా అనుకూలంగా ఉండటం, పెద్ద సంఖ్యలో వాహనాల పార్కింగ్ కోసం స్థలం ఉండటంతో అధికారులు దీని పేరునే ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం.