తెలంగాణ అసెంబ్లీ స్పీకర్(Speaker of the Assembly)గా గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.. స్పీకర్ ఏకగ్రీవానికి మద్దతు ఇచ్చిన విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. గడ్డం ప్రసాద్ అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చారని అన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా గడ్డం ప్రసాద్ విశేష సేవలు అందించారని తెలిపారు.
అదేవిధంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) అసెంబ్లీలో మాట్లాడుతూ.. గడ్డం ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలిచ్చారని తెలిపారు. గడ్డం ప్రసాద్ చేనేత శాఖ మంత్రిగా సిరిసిల్లకు వచ్చి కార్మికుల సంక్షేమానికి కృషి చేశారని అన్నారు. 2009లో ఇద్దరం శాసనసభ సభ్యులుగా ఉన్నామని తెలిపారు.
సామాన్య ఎంపీటీసీ పదవి నుంచి అసెంబ్లీ స్పీకర్‌గా ఎదిగిన గడ్డం ప్రసాద్ కుమార్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు కేటీఆర్. అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ స్పీకర్లుగా మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి నెలకొల్పిన సంప్రదాయాలు, కాపాడిన విలువలను ప్రసాద్ కుమార్ కొనసాగించాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
కాగా, అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు గడ్డం ప్రసాద్ కుమార్‌ను స్పీకర్ కుర్చీలో కూర్చొబెట్టారు.