ప్రముఖ యూట్యూబర్(youtuber) చందు సాయి(Chandu Sai)ని పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపులు చేస్తున్నాడని ఓ యువతి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విషయాల ప్రకారం.. నార్సింగికి చెందిన యువతిని చందు సాయి ప్రేమ పేరుతో మోసం చేసినట్లు సమాచారం.
చందుసాయి తనను లైంగికంగా వాడుకుని ఆ తర్వాత ముఖం చాటేశాడని పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. మోసపోయానని గ్రహించి బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు నార్సింగి పోలీసులు వివిధ కేసుల నమోదు చేసి చందును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే చందు సాయి యూట్యూబ్‌లో బాగా ఫేమస్. చందు గాడు, పక్కింటి కుర్రాడు లాంటి యూట్యూబ్ ఛానెల్స్‌లో ఫన్నీ, మెసేజ్ ఓరియెంటెడ్ వీడియోలు చేసేవాడు. కామెడీ వీడియోల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
చందుసాయి పనిచేసే యూట్యూబ్ చానళ్లకు మిలియన్ల కొద్దీ వ్యూవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో ఈ మధ్య వీడియోలు చేయడం మానేసిన చందుసాయి పలు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవల మహేష్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించాడు. అలాగే పలు సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో కనిపించాడు.