తెలంగాణ(Telangana) ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) కసరత్తు చేస్తోంది. ఆరు గ్యారంటీ పథకాల అమలుకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపరిపాలన నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు ప్రభుత్వం అధికారులను సమాయత్తం చేసింది. దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకాధికారులను నియమించింది. ఈ ప్రజాపరిపాలన కార్యక్రమంలో భాగంగా పదిరోజుల పాటు గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. తాజాగా, ప్రభుత్వం అభయహస్తం పబ్లిక్ గవర్నెన్స్ అప్లికేషన్ పేరుతో దరఖాస్తు ఫారాన్ని విడుదల చేసింది. ఒక్కో పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా.. అందరికీ ఒకే దరఖాస్తును సిద్ధం చేసింది.
ముందుగా కుటుంబ వివరాలను పూరించాలి. ఇందులో కుటుంబ వివరాల్లో.. కుటుంబ యజమాని పేరుతో ప్రారంభించి.. పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నంబర్, రేషన్ కార్డు నంబర్, మొబైల్ నంబర్, వృత్తి, కులంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలను కూడా నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేనేత పథకాలకు సంబంధించిన వివరాలను వరుసగా నమోదు చేయాలి. ఏదైనా పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆ పథకం కింద అడిగిన వివరాలను నమోదు చేయాలి.
ఉదాహరణకు మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే సంబంధిత బాక్సులో టిక్ మార్క్ వేయాలి. రూ.500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వారు గ్యాస్ కనెక్షన్ నంబర్, ఏజెన్సీ పేరు, ఏడాదికి ఉపయోగించే సిలిండర్ల సంఖ్యను నమోదు చేయాలి. అలా రైతు భరోసా, గృహజ్యోతి, చేనేత పథకం, ఇతర పథకాలకు చెందిన బాక్సుల్లో సంబంధిత వివరాలను రాయాలి.
ఈ దరఖాస్తుకు ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు తెల్ల రేషన్‌కార్డు జిరాక్స్‌ను జతచేయాలి. నింపిన దరఖాస్తును గ్రామసభలో అధికారికి ఇచ్చి.. వారు అడిగిన వివరాలు చెబితే.. దరఖాస్తుదారు ఏ పథకానికి అర్హులో పరిశీలించి నిర్ణయిస్తారు. అందుకే.. దరఖాస్తు చివర రసీదులో నమోదు చేసి.. సంతకం చేసి ప్రభుత్వ ముద్ర ఇచ్చారని దీనిని గమనించాలని కోరారు. టిక్ మార్కులు కొట్టివేయకుండా ఒకటికి రెండు సార్లు చూసి వేయాలని సూచిస్తున్నారు.