– కేసీఆర్ ను కలిసిన జగన్
– భేటీ వెనుక రహస్యం ఏంటి?
– పైకి పరామర్శ
– వెనుక ఇచ్చిపుచ్చుకోవాలనే ధ్యాస
– ఇప్పటికే చంద్రబాబు, పవన్ తో ఇబ్బందులు
– ఇప్పుడు షర్మిల ఎంట్రీతో అవస్థలు
– రిటర్న్ సాయం కోసమే జగన్ కలిశారా?
– ఏపీలో పొత్తుపై చర్చ జరిగిందా?
బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR), ఏపీ సీఎం జగన్ (CM Jagan) మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. 2019 ఎన్నికల తర్వాతి నుంచి జరిగిన పరిణామాలను గమనించిన ఎవరికైనా ఇది అర్థం అవుతుంది. ప్రాణ స్నేహితుల మాదిరి వీళ్లిద్దరి సమావేశాలు కొనసాగాయి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీలు సద్దుమణుగుతాయని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా కొన్నాళ్లకు ఇద్దరూ సైలెంట్ అయిపోయారు.
రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీ ఎక్కువైంది. దీని వెనుక ఇద్దరు నేతలు చాకచక్యంగా ఒకరికొకరు సాయం అనే ధోరణితో ముందుకు వెళ్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సమయంలో నాగార్జున సాగర్ దగ్గర జరిగిన గొడవను గమనించిన ఎవరికైనా ఇది అర్థం అవుతుంది. కరెక్ట్ గా ఎన్నికల రోజే వివాదం చెలరేగడం కేసీఆర్ కు ప్లస్ చేసే ప్రయత్నమనే చర్చ జరిగింది. అయితే.. చాలా కాలం తర్వాత జగన్ హైదరాబాద్ కు వచ్చారు. కేసీఆర్ ను కలిశారు.
జూబ్లీహిల్స్ నంది నగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ జగన్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు రిసీవ్ చేసుకున్నారు. డిసెంబర్ 7న ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ లో కేసీఆర్ కాలు జారి పడ్డారు. ఆయన ఎడమ తుంటికి గాయాలు శస్త్రచికిత్స జరిగింది. కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను పరామర్శించేందుకు జగన్ వెళ్లారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే.. అసలు విషయం వేరే ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఇంకో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలున్నాయి. రిటర్న్ సాయం కోసమే కేసీఆర్ ను కలిశారని అంటున్నారు. టీడీపీ-జనసేన కలయికతో వైసీపీకి గడ్డు పరిస్థితి ఎదురైంది. దీనికితోడు చెల్లెలు షర్మిల కాంగ్రెస్ లో చేరి సవాల్ విసిరేందుకు సిద్ధమయ్యారు. ఇంకోవైపు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ సాయం కోసం జగన్ కలిశారని రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా కలిసి పోటీ చేయడంపైనా ఇద్దరు నేతలు చర్చించినట్టు సమాచారం.