అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఇక పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) కోసం పార్టీలు సిద్దం అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. రాష్ట్రాలు ఎంతవరకు పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నాయో సమీక్షించేందుకు సిద్దం అయ్యింది. ఈ క్రమంలో వచ్చే వారం నుంచి పర్యటనలు చేపట్టనుంది.
ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajeev Kumar).. ఇతర కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్ గోయల్‌తో కూడిన బృందం రాష్ట్రాలలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 7న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh).. 10న తమిళనాడు (Tamil Nadu)లో లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించనుందని సమాచారం..
మరోవైపు ఈసీ పర్యటనకు ముందు డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఇప్పటికే అన్నిరాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల సన్నద్ధతను పరిశీలించారు. ఇక శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈసీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి రాజకీయ పార్టీల నేతలు, సీనియర్ పోలీసు, పాలనా అధికారులతో పాటు క్షేత్రస్థాయి ఎన్నికల సిబ్బందితో సమావేశం కావడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మరోసారి ఈసీ పర్యటనకు సిద్దం అయ్యింది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పర్యటించే అవకాశం లేదని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
మరోవైపు 2019లో లోక్‌సభ ఎన్నికలకు మార్చి 10న షెడ్యూల్ ప్రకటించిన ఈసీ (EC).. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించింది. మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. అయితే 2024లో సైతం ఈసీ ఇలాగే చేస్తుంది కావచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా అప్పుడే రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికల జోరు మొదలైంది. ఎన్డీఏను బలోపేతం చేసుకొంటున్న బీజేపీ, ఎన్నికల్లో విజయంపై ధీమాతో ముందుకెళ్తోంది.
మూడోసారి మోడీ సర్కారు అధికారంలోకి రావడం గ్యారెంటీ అని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన ఈ కూటమి, ప్రస్తుతం సీట్ల పంపకం ఖరారు చేసే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం..