తెలంగాణ (Telangana) రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై విమర్శలు ఆగడం లేదు.. ఇచ్చిన హామీల సంగతి ఏంటని బీఆర్ఎస్ (BRS) నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండగా.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అడ్డగోలుగా సంపదను దోచుకొన్నారని కాంగ్రెస్ (Congress) నేతలు మండిపడుతున్నారు.. ఇప్పటికే పలువురు మంత్రులు గులాబీ పాలనపై గుర్రుగా ఉన్నారు.. ఈ క్రమంలో ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ తన పదేళ్ల పాలనలో గ్రామాలు, తండాల్లో సరైన సౌకర్యాలు కలిపించడంలో విఫలం అయ్యిందని జూపల్లి ఆరోపించారు.. ఇప్పటి వరకు ఎల్లారం తండాకు ఎమ్మెల్యే, ఎంపీ వచ్చినా దాఖలాలు లేవని ఫైర్ అయ్యారు. గూగుల్ మ్యాప్ లో ఈ తండా పేరే లేదని తెలుపుతున్నట్టు వెల్లడించారు. అభివృద్ధి పేరుతో అప్పులు చేసిన గత ప్రభుత్వం వాటన్నింటిని ఎక్కడ ఉపయోగించిందో తెలుపాలని డిమాండ్ చేశారు..
రాష్ట్ర ఆదాయం పెరగాలి కానీ, కల్వకుంట్ల ఫ్యామిలీ ఆదాయం మాత్రం పదేళ్ళలో ఎలా మించి పోయిందో తెలుపాలంటూ జూపల్లి ప్రశ్నించారు.. కాగా చారిత్రాత్మక కౌలాస్ కోటను జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) సందర్శించారు. ఎంతో ప్రసిద్ధి చెందిన కౌలాస్ కోటను (Kowlas Fort) అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. దీనిపై ప్రతిపాదనలు రూపొందించి, నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా… ప్రజల వద్దకు పాలన తెచ్చామని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రెండు హామీలను అమలు చేశారని తెలిపారు.. అయితే దశల వారీగా మిగితా హామీలను అమలు చేస్తామన్నారు.