Telugu News » Hyderabad : ఫార్ములా-ఈ రేసింగ్ తో ఆర్థిక వ్యవస్థకు లాభం ఉందా..?

Hyderabad : ఫార్ములా-ఈ రేసింగ్ తో ఆర్థిక వ్యవస్థకు లాభం ఉందా..?

ఈ సందర్భంగా కేటీఆర్ కావాలనే డ్రామా చేస్తున్నారని హస్తం శ్రేణులు మండిపడుతున్నారు. రేసింగ్ జరగకపోవచ్చని గతేడాది సెప్టెంబర్ లోనే హిందూ పత్రిక సహా మీడియాలో కథనాలు వచ్చాయని.. దానికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ.. కాంగ్రెస్ ను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఫైరవుతున్నారు.

by admin
Formula E race

– నగరంలో ఫార్ములా-ఈ రేస్ మంటలు
– హైదరాబాద్ బ్రాండ్ డ్యామేజ్ చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శలు
– ఇది తిరోగమనమన్న మాజీ మంత్రి కేటీఆర్
– అసలు, ఈ రేసింగ్ తో లాభం ఉందా..?
– ఇప్పటిదాకా ఏమన్నా పెట్టుబడులు వచ్చాయా?

హైదరాబాద్ (Hyderabad) లో ఫార్ములా-ఈ రేస్ (Formula E Race 2024) సీజ‌న్ 10కు చెందిన రేస్ ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గాల్సి ఉంది. అయితే ఈ రేస్‌ ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వానికి చెందిన మున్సిప‌ల్ శాఖ‌.. హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించిన‌ట్లు తెలిపారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 30వ తేదీ జ‌రిగిన ఒప్పందాన్ని మున్సిప‌ల్ శాఖ ఉల్లంఘించిన‌ట్టు ప్రకటనలో పేర్కొన్నారు. అందుకే ఫార్ములా-ఈ రేస్‌ ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ మేరకు మున్సిప‌ల్ శాఖకు నోటీసులు కూడా పంపారు. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చ‌ట్టాల ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు ఎఫ్ఈవో ప్రకటించింది. అయితే.. ఈ రేస్ ఎలా మొదలైంది? పెట్టుబడుల అంశంలో జరుగుతున్న వివాదంలో నిజమెంత..? ఇలా అనేక అంశాలపై చర్చ జరుగుతోంది.

Formula E race

నగరంలో ఎలా మొదలైంది..?

ఫార్ములా రేస్… ఎప్పుడైతే మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన మేనేజింగ్‌ కమిటీ ఏర్పాటైందో.. ఆనంద్ మహీంద్రా, దిల్‌ బాగ్‌ డిల్‌, ఉన్నతాధికారులు, బ్రాండ్ అంబాసిడర్స్‌, నిపుణులు సభ్యులు అయ్యారో.. అప్పటి నుంచి దీనిపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఫార్ములా-ఈ సంస్థ ఈ ప్రిక్స్‌, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌ మెంట్ డిపార్ట్‌మెంట్లతో కలిసి 2023 అక్టోబర్ 30న రేసింగ్‌ కు సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. 2024 ఫిబ్రవరిలో ఫార్ములా-ఈ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ కు ప్లాన్ చేశారు. ఈ పోటీలకు సన్నాహకంగా గతేడాది అక్టోబర్ లో ఎఫ్-1 రేస్ నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ట్రాక్ నిర్మాణం జరిగింది. ఆ సమయంలో హైదరాబాద్ పేరు మార్మోగింది. సినీ, క్రీడా ప్రముఖులు ఈ ఈవెంట్ ను చూసేందుకు తరలివచ్చారు.

చంద్రబాబు హయాంలోనే అడుగులు

గతేడాది హైదరాబాద్‌ లో రేస్ జరిగితే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రేసర్లు వచ్చి పాల్గొన్నారు. వేల రూపాయలు టికెట్ ధర పెట్టినా వీక్షకులు పోటెత్తారు. అయితే.. ఫార్ములా రేస్ నిర్వహణకు చంద్రబాబు హయాంలోనే అడుగులు పడ్డాయి. 1995-2004 మధ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. అప్పట్లోనే ఈ క్రీడ ఔన్నత్యాన్ని గుర్తించారు. దీని వల్ల టూరిజం అభివృద్ధి జరుగుతుందని.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని.. తద్వారా ఆంధ్రప్రదేశ్ పేరు మార్మోగుతుందని భావించారు. ఎఫ్-1 రేస్ నిర్వహణ కోసం.. రంగారెడ్డి జిల్లాలో 3 వేల ఎకరాలు భూమిని కూడా కేటాయించారు. అయితే.. ఇది వాస్తవ రూపంలో అమలులోకి వచ్చేలోపే సాధారణ ఎన్నికలు రావడం.. ఆయన ఓడిపోవడం జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. ఆ భూకేటాయింపును రద్దు చేశారు.

రూ.650 కోట్ల ప్రయోజనం.. నిజమేనా?

ఈ రేసింగ్ ఈవెంట్‌ ను ప్రపంచంలో 12 దేశాలు మాత్రమే నిర్వహిస్తున్నాయి. అందులో భారత్ కూడా చేరుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడది జరగలేదు. రేస్ మెక్సికోకు తరలిపోయింది. హైదరాబాద్‌ కి బదులుగా హాంకుక్ మెక్సికో సిటీలో ఈ రేస్ నిర్వహించనున్నట్లు ఫార్ములా సంస్థ తెలిపింది. సీజ‌న్ 10 రేస్‌ లు జ‌ర‌గ‌నున్న న‌గ‌రాల్లో టోక్యో, షాంఘై, బెర్లిన్‌, మొనాకో, లండ‌న్ న‌గ‌రాలు ఉన్నాయి. ఈనెల 13వ తేదీ నుంచి ఈ సీజ‌న్ ప్రారంభం కానుంది. మెక్సికోలోని హాంకూక్‌ లో తొలి రేస్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ జ‌రిగిన ప్రారంభోత్సవ రేస్ చాలా స‌క్సెస్ అయ్యింద‌ని, ఆ రేస్ వ‌ల్ల హైదరాబాద్ లో సుమారు 84 మిలియ‌న్ల డాల‌ర్ల (రూ.650 కోట్లు) ఆర్థిక ప్ర‌గ‌తి జ‌రిగింద‌ని ఫార్ములా-ఈ సీఈవో జెఫ్ డోడ్స్ తెలిపారు. దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రమోట్ చేసింది. తాజాగా ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ ను బూచిగా చూపిస్తున్నారా?

ఫార్ములా-ఈ రేసు రద్దు కావడంతో మాజీ మంత్రి కేటీఆర్‌ ఫైరయ్యారు. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయమని అన్నారు. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్‌ లు ప్రపంచవ్యాప్తంగా మన నగరం దేశం బ్రాండ్ ఇమేజ్‌ ను పెంచుతాయని తెలిపారు. ప్రపంచంలో హైదరాబాద్‌ ను ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా చూపించడానికి, ఔత్సాహికులు, తయారీదారులు స్టార్టప్‌ లను ఆకర్షించడానికి ఫార్ములా రేసును ఓ సాధనంగా చేసుకున్నట్టు వెల్లడించారు. నగరానికి 650 కోట్ల ప్రయోజనం జరిగిందని తెలిపారు. అలాంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వృధా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ ట్వీట్ తో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. బ్రాండ్ హైదరాబాద్ కు ఇది భారీ దెబ్బగా అభివర్ణిస్తున్నారు. కాంగ్రెస్ నిర్ణయం దురదృష్టకరమని.. బెంగళూరు కోసం బ్రాండ్ హైదరాబాద్ ని స్కాంగ్రెస్ నాశనం చేస్తోందని విమర్శలు చేస్తున్నారు.

కేటీఆర్ కు ఎదురవుతున్న కౌంటర్లు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందంటూ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రి విడుదల చేసింది. దీనివల్ల పెట్టుబడులు వెనక్కి పోతాయని బీఆర్ఎస్ విమర్శలు చేసింది. ఇప్పుడు మరోసారి ఫార్ములా-ఈ రేస్ రద్దును అడ్డుగా పెట్టుకుని ఎటాక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు కూడా రంగంలోకి దిగారు. ఒక కార్ రేస్ కి సిటీ బ్రాండ్ కి ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. అలా అయితే ఒలంపిక్స్ ని ఎక్కువ సార్లు(3 సార్లు) హోస్ట్ చేసింది అమెరికా, యూకే… అలాంటప్పుడు యూకే కూడా ఎకానమీ వారీగా ధనిక దేశంగా ఉండాలిగా.. అమెరికా ఫస్ట్ లో ఉంటే యూకే ఆరోస్థానంలో ఎందుకుందని ప్రశ్నిస్తున్నారు. కొందరైతే.. ఫార్మాలా రేస్, పబ్స్ అభివృద్ధికి చిహ్నాలు కాదంటూ కామెంట్లు పెడుతున్నారు. ముందు గ్రామాల్లో అభివృద్ధి బాటలు వేయాలని.. సమస్యలతో ప్రజా భవన్ కు వస్తున్న జనం కన్నీళ్లను ఓసారి చూడండి అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కావాలనే డ్రామా చేస్తున్నారని హస్తం శ్రేణులు మండిపడుతున్నారు. రేసింగ్ జరగకపోవచ్చని గతేడాది సెప్టెంబర్ లోనే హిందూ పత్రిక సహా మీడియాలో కథనాలు వచ్చాయని.. దానికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ.. కాంగ్రెస్ ను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఫైరవుతున్నారు.

You may also like

Leave a Comment