భారత్-మాల్దీవుల మధ్య వివాదం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మినికాయ్ ద్వీపం (Minicoy Islands)లో నూతన విమానాశ్రయాన్ని(Airport) నిర్మించాలని కేంద్రం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మిలటరీ, పౌరవిమానాలను అనుమతించేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు రెడీ అవుతోందని సమాచారం.
అలా చేస్తే అటు పర్యాటక రంగానికి, ఇటు మిలటరీకి ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రం భావిస్తోంది. లక్షద్వీప్‌కు సమీపంలో అగట్టి ప్రాంతంలో ఒక విమానాశ్రయం ఉంది. కానీ ఇది కేవలం చిన్న తరహా విమానాల ల్యాండింగ్ కు మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ క్రమంలో మినికాయ్ దీవుల్లో మరో విమానాశ్రయాన్ని నిర్మిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తోంది.
మినికాయ్ దీవుల్లో విమానాశ్రయాన్ని నిర్మించాలని గతంలోనే కేంద్రానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రతిపాదనలు పంపింది. కానీ ఆ ప్రతిపాదనల పట్ల కేంద్రం గతంలో ఆసక్తి చూపించలేదు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి విమానాశ్రయ ప్రతిపాదనలు కేంద్రం ముందుకు వచ్చాయి. ఈ నూతన విమానశ్రయం సైనికపరంగా భారత్ కు అత్యంత కీలకంగా మారనుంది.
ఈ నూతన విమానాశ్రయం అరేబియా సముద్రం, హిందు మహాసముద్రంపై పర్యవేక్షణకు ఈ నూతన విమానాశ్రయం సహాయపడనుంది. ఇటీవల లక్షద్వీప్‌లో ప్రధాని మోడీ పర్యటించారు. అక్కడి పర్యటకాన్ని ప్రోత్సహించేలా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ, భారత్ పై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో దుమారం రేగింది.