పాకిస్థాన్(Pakistan)లో హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో 11మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. పాకిస్థాన్లోని లక్కీ మార్వాట్ జిల్లా(Lucky Marwat District) తఖీఖేల్ గ్రామంలో ఈ ఘటన కలకలం రేపింది. అయితే, మృతులంతా ఒకే కుటుంబానికి చెందినట్లు సమాచారం.
ఈ మేరకు పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుల సోదరుడు రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చేసరికి ఇంటి గేటు బయటి నుంచి తాళం వేసి ఉండటాన్ని గుర్తించాడు. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి తన కుటుంబసభ్యులంతా విగత జీవుల్లా పడి ఉన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.
మృతిచెందిన కుటుంబంలో ఇద్దరు సోదరులు, వారి పిల్లలు, వారి ఇంటికి వచ్చిన అతిథి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండు రోజుల కిందట వీరు మృతిచెందినట్లు తెలుస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు వీరిపై విషప్రయోగం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆ వ్యక్తి కుటుంబసభ్యుల్లో ఒకరై ఉండవచ్చని తెలిపారు. ఇంటి గేటును బయట నుంచి మూసివేసి అక్కడ నుంచి పారిపోయి ఉంటాడని తెలిపారు. రెండు రోజుల కిందట కుటుంబ సభ్యులు వజీరిస్థాన్ నుంచి ఆహారం కొనుగోలు చేశారని తెలిపారు. అయితే, ఆహారంలో ఏమైనా విష పదార్థాలు కలవడం ద్వారా మృతిచెందారని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్నంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని విచారణ చేపట్టారు.