భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో చాలా మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ (Ukrain)లో చిక్కుకున్నారని తెలిపారు. ఆ సమయంలో ప్రధాని మోడీ దౌత్యం వల్ల యుద్ధం నాలుగైదు గంటలు నిలిచిపోయిందన్నారు. దీంతో భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకు రాగలిగామని వెల్లడించారు.
లండన్‌లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. అక్కడ ఓ కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ…. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో చాలా మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకున్నారని తెలిారు. దీంతో భారత విద్యార్థుల భద్రత గురించి వాళ్ల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. ఈ క్రమంలో భారతీయ విద్యార్థులను స్వదేశానికి క్షేమంగా తీసుకు వచ్చే బాధ్యతను ప్రధాని మోడీ భుజానికెత్తుకున్నారని అన్నారు.
వెంటనే ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమర్ జెలెన్ స్కీలతో ప్రధాని మోడీ ఫోన్ లో చర్చించారు. దీంతో యుద్దాన్ని తాత్కాలికంగా నిలిపి వేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయన్నారు. అదే సమయంలో అమెరికా ఎలాంటి జోక్యం చేసుకున్న విద్యార్థులను సురక్షితంగా తీసుకు వచ్చే ప్రక్రియకు ఆటంకం కలిగే అవకాశం ఉండటంతో ఈ విషయంపై ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ తో కూడా మోడీ చర్చించారన్నారు.
ప్రధాని మోడీ దౌత్య విధానాల వల్ల యుద్ధం నాలుగైదు గంటలు నిలిచి పోయిందని చెప్పారు. దీంతో ఉక్రెయిన్ నుంచి 22,000 మంది భారతీయ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చామని వివరించారు. డిజిటల్ లావాదేవీల విషయానికి వస్తే, భారతదేశం మినహా మరే దేశంలోనూ 80 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు లేరని చెప్పారు. యూపీఐ ద్వారా మనం చేస్తున్న డిజిటల్ లావాదేవీలను ప్రపంచం మొత్తం గుర్తించిందన్నారు. మన దేశంలో ఇప్పటి వరకు యూపీఐ ద్వారా దాదాపు 130 లక్షల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు.