సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరం బోసిపోతుంది. వరుసగా పండగ సెలవులు రావడంతో జనం తమ సొంత ఊరు బాట పట్టారు.. ఈ క్రమంలో నగర శివారు ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్లు రద్దీతో నిండిపోయాయి.. సొంత వాహనాలో వెళ్తున్న వారితో టోల్ గేట్లు కిటకిటలాడుతోన్నాయి.. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా చౌటుప్పల్ (Choutuppal) పట్టణ కేంద్రంలో వాహనాలు బారులు తీరాయి.
హైదరాబాద్ (Hyderabad) నుంచి సొంతూర్లకు ప్రజలు పెద్దసంఖ్యలో వెళ్తుండటంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిందని సమాచారం.. దీంతో సంస్థాన్ నారాయణపురం క్రాస్ రోడ్డుని పోలీసులు మూసివేశారు. అటువైపు వెళ్లే వాహనాలు వలిగొండ రోడ్డు వద్ద యూటర్న్ తీసుకొని వెళ్లాల్సి వస్తున్నదని తెలుస్తోంది.
అదీగాక చౌటుప్పల్ బస్టాండ్ వద్ద క్రాసింగ్ మార్గాన్ని సైతం కొద్దిసేపు మూసివేయడంతో స్థానిక వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడినట్టు తెలుస్తోంది. ఇక ఎంతో ఘనంగా నిర్వహించుకొనే సంక్రాతికి (Sankranti) పట్నవాసులు పల్లె బాటపట్టడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH 65)పై వాహనాలు క్యూకట్టాయి.
పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతోన్నాయి. టోల్‌ప్లాజాలో మొత్తం 18 టోల్ బూత్‌లు ఉండగా విజయవాడ మార్గంలో 10 బూత్‌లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. మరోవైపు పండుగ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులను ప్రకటించారు. జనవరి 12 నుంచి 17 వరకు హాలీ డేస్ ఉండనున్నాయి. తిరిగి 18వ తేది నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.