ఏపీ(AP) రాజధాని అమరావతి (Amaravathi) ప్రాంతంలోని మందడం (Mandam) గ్రామంలో భోగి సంబురాలు అంబరాన్నంటాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu nayudu), జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చంద్రబాబు పంచె కట్టుకుని సంప్రదాయబద్ధంగా కనిపించారు.
ఈ సందర్భంగా “పల్లె పిలుస్తుంది రా కదలి రా” పేరుతో టీడీపీ వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నాలుగున్నర ఏళ్లుగా జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల జీవో కాపీలను మంటల్లో దహనం చేశారు. అనంతరం ఏపీలోని వివిధ సమస్యల చిత్రపటాలు, జీవో కాపీలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంటల్లో తగులబెట్టారు.
అదేవిధంగా టీడీపీ, జనసేన జెండా గుర్తులతో సహా మహిళలు వేసిన ముగ్గులను వారు పరిశీలించారు. గుంటూరు జిల్లాలోని టీడీపీ కార్యాలయం వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ‘కీడు తొలగాలి.. ఏపీ వెలగాలి’ అనే పేరుతో వేడుకలు నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ చంద్రబాబు ప్రకటించిన సూపరిక్స్, యువగళం, రీబిల్డ్ ఏపీ తదితర అంశాల మీద రేపు ముగ్గులు వేసి వాటితో సెల్ఫీలు దిగాలని పిలుపునిచ్చారు.
ఓటర్ వెరిఫికేషన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకొని ఓటు ఉందో? లేదో? తనిఖీ చేసుకోవాలని సూచించారు. సొంతూళ్లకు చేరుకున్న వారు సాయంత్రం గ్రామస్థాయిలో ఆత్మీయ సమావేశం నిర్వహించి స్థానికంగా నెలకొన్న సమస్యలు, చేయాల్సిన అభివృద్ధి పనులపై ఓ తీర్మానం చేయాలని కోరారు. ముగ్గుల ఫొటోలను ‘పల్లె పిలుస్తోంది.. రా కదలి రా..’ లైన్‌కు హ్యాష్ ట్యాగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని చంద్రబాబు కోరారు.
అదేవిధంగా దేవతల రాజధాని అమరావతిని రాక్షసులు చరబట్టారని, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలని చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటు పడిందన్నారు. రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతలను ముప్పుతిప్పలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని చంద్రబాబు తెలిపారు. ‘వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్’ కోసం నేటి నుంచి 87 రోజుల పాటు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ దళితులు, బీసీలపై దాడులకు తెగబడుతోందని అన్నారు. 32రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.