Telugu News » ఆశల యాత్ర…!  

ఆశల యాత్ర…!  

అల్లర్లకు కేంద్ర బిందువుగా మారిన మణిపూర్ నుంచే ఈ యాత్రను స్టార్ట్ చేశారు. తౌబాల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ మైదానంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.

by Ramu

– ఎన్నో కలలతో భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం
– అల్లర్లు చెలరేగిన మణిపూర్ నుంచే షురూ
– ధరల పెరుగుదల, నిరుద్యోగాన్ని ఎత్తిచూపే ప్రయత్నం
– సామాజిక న్యాయంతో ముందుకెళ్తామన్న రాహుల్
– పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా సాగనున్న టూర్
– జోడో యాత్రతో కాంగ్రెస్‌కు పెరగని మైలేజ్
– మూడు ప్రధాన రాష్ట్రాల్లో ఘోరంగా ఫెయిల్
– ఇప్పుడు న్యాయ్ యాత్ర ఏ మేరకు ప్లస్ అవుతుంది..?
– పార్లమెంట్ ఎన్నికల వరకు సాగనున్న న్యాయ్ యాత్ర

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ (Congress)కు బూస్టప్ ఇచ్చేందుకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు శ్రీకారం చుట్టారు ఆపార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). అల్లర్లకు కేంద్ర బిందువుగా మారిన మణిపూర్ నుంచే ఈ యాత్రను స్టార్ట్ చేశారు. తౌబాల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ మైదానంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర హైబ్రిడ్ పద్ధతిలో చాలా వరకు బస్సులో, కొంతమేర పాదయాత్ర ద్వారా కొనసాగనుందని తెలుస్తోంది.

ధరల పెరుగుదల, నిరుద్యోగం, సామాజిక న్యాయం వంటి అనేక అంశాలను ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళ్ళే ఆలోచనలో ఉంది కాంగ్రెస్. మొత్తం 15 రాష్ట్రాల్లోని 100 లోక్ సభ నియోజకవర్గాల్లో సాగే భారత్ జోడో న్యాయ్ యాత్ర.. 67 రోజుల్లో 110 జిల్లాలు, 337 శాసనసభ నియోజకవర్గాల్లో 6 వేల 713 కిలోమీటర్లు సాగనుంది. మార్చి 20 లేదా 21 తేదీల్లో ముంబైలో ముగుస్తుంది. దేశ ప్రజలను ఏకం చేయడానికే భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టినట్టు రాహుల్ గాంధీ తెలిపారు. గత కొన్ని రోజులుగా మణిపూర్ రగులుతోందని.. ప్రధాని ఎందుకు రాలేదని ప్రశ్నించారు. భారత్ న్యాయ్ యాత్రను ముంబై నుంచి ప్రారంభించాలని చాలా మంది చెప్పారు కానీ.. తాను మణిపూర్‌నే ఎంచుకున్నానని తెలిపారు.

ఎంతో మంది అన్నాదమ్ముళ్లు మణిపూర్‌లో చనిపోయారన్నారు. తాము మణిపూర్ ప్రజల బాధను అర్థం చేసుకున్నామని చెప్పారు. మళ్లీ ప్రశాంతత మణిపూర్‌ను తిరిగిచ్చేస్తానని రాహుల్ అక్కడి ప్రజలకు మాటిచ్చారు. హింస, అన్యాయం లేని దేశం కావాలన్నారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు రాహుల్ గాంధీ. గతేడాది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో పేరుతో సుమారు 4వేల కిలోమీటర్లు నడిచిన రాహుల్, ఈసారి న్యాయ్ యాత్ర చేపట్టారు.

అయితే.. ఇది ఎంత మేరకు వర్కవుట్ అవుతుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. జోడో యాత్ర వల్ల రాహుల్‌కు మైలేజ్ వచ్చిందే గానీ, పార్టీకి పెద్దగా ఉపయోగం జరగలేదు. తర్వాత వచ్చిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ మినహా మిగిలిన ఏ రాష్ట్రాల్లోనూ సత్తా చాటలేదు. ఆఖరికి అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పవర్ కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాహుల్ చేపట్టిన న్యాయ్ యాత్ర ఎంత మేరకు లాభం చేకూర్చుతుందో చూడాలి.
పూర్తి కథనం…

You may also like

Leave a Comment