లారీ డ్రైవర్లు (Lorry drivers) సమ్మె( Strike) విరమించుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టంలోని 106(2) హిట్ అండ్ రన్‌కి సంబంధించిన సెక్షన్‌ని ఇప్పట్లో అమలు చేయమని కేంద్ర హోంశాఖ ప్రకటించిన విషయాన్ని గమనించాలని కోరారు..
డ్రైవర్ల సమస్య కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు కలిగించద్దని పొన్నం ప్రభాకర్ కోరారు. ఒకవేళ భవిష్యత్‌లో అమలు చేయాల్సి వస్తే చర్చలు జరుపుతామని పేర్కొన్నారు.. మరోవైపు డ్రైవర్స్, లారీ ఓనర్స్ ని పిలిచి మాట్లాడిన తరువాతనే అమలు చేస్తామని కేంద్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ భల్ల (Ajay Bhalla) హామీ ఇచ్చిని విషయాన్ని గుర్తు చేశారు.
ఇవేమీ ఆలోచించకుండా కొన్ని గుర్తింపు లేని సంఘాలు రేపటి నుంచి లారీల సమ్మె చేయాలని భావించడం సరైనది కాదని పొన్నం ప్రభాకర్ అన్నారు.. ఈ సమ్మెని గుర్తింపు పొందిన సంఘాలతో పాటు మెజారిటీ సంఘాలు వ్యతిరేకిస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు.. కొత్త చట్టం రాష్ట్ర పరిధిలోనిది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని తెలిపారు.
లారీ డ్రైవర్లు సమ్మెలోకి వెళ్తే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని వెంటనే సమ్మెపై పునరాలోచించాలని కోరారు. సమ్మె వల్ల ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారుతుందని.. ఇప్పటికే జనం పెరుగుతోన్న ధరలతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు.. సమ్మె ప్రభావం సామాన్య జనంపై పడే అవకాశం ఉందని పొన్నం ప్రభాకర్ తెలిపారు..