మణిపూర్‌లో (Manipur) హింసాత్మక ఘటనలు (Violence) కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాస్త ఆగింది అనుకొన్న ఘర్షణ వాతావరణం.. ఒక్క సారిగా మరోసారి వేడెక్కింది. దీంతో మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.. టెంగ్నోపాల్ (Tengnoupal) జిల్లా, సరిహద్దు పట్టణం మోరే (Moreh)లో బుధవారం ఉదయం కుకీ తిరుగుబాటు దారులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ కమాండో మృతి చెందారు.
తిరుగుబాటు దారులు మోరే పట్టణ సమీపంలోని భద్రతా కార్యాలయంపై బాంబులు విసరగా.. భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్ కౌంటర్‌లో గాయపడిన పోలీస్ మరణించారు. మోరేలో ఓ పోలీసు అధికారిని హత్య చేశారనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత ఈ హింస చోటుచేసుకొంది. కాగా, ఈశాన్య రాష్ట్రంలో కొద్ది రోజులుగా అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే.
మరోవైపు మే 3వ తేదీ నుంచి మణిపూర్‌లో మైతేయి, కుకీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ గొడవల్లో సుమారుగా 190 మంది ప్రాణాలు కోల్పోయినట్లు. 50 వేల పైచిలుకు జనం నిరాశ్రయులైనట్లు అధికారులు ప్రకటించారు. ఇటీవలే ఇంటర్నెట్ సేవలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తేసింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని భావిస్తున్న సమయంలో ఇంతలోనే మళ్లీ అలజడి రేగింది.
ప్రస్తుతం కాంగ్రెస్ (Congress) అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.. ఈ యాత్ర ప్రారంభించి నేటితో మూడు రోజులు అవుతోంది. ఇంతలోనే మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది..