టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్.ధోనీ(MS Dhoni)పై పరువు నష్టం దావా వేస్తూ ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో పిటిషన్ దాఖలైంది. క్రికెట్ అకాడమి విషయంలో మాజీ వ్యాపార భాగస్వాములు తనను రూ.15కోట్ల మేర మోసం చేశారంటూ ధోనీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కా స్పోర్ట్స్ డైరెక్టర్స్ మిహిర్ దివాకర్, సౌమ్య దాస్లు తాజాగా మహీపై పరువు నష్టం దావా వేయడం సంచలనంగా మారింది. తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ వారు చెబుతున్నారు. తమ పరువుకు భంగం కలిగించిన ధోనీ నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు.. తమపై అవాస్తవాలను ప్రచారం చేయకుండా సోషల్ మీడియా, మీడియా సంస్థలను నిలువరించాలని కోరారు.
దివాకర్, సౌమ్యల అభ్యర్థనపై హైకోర్టు జనవరి 18న విచారణ జరపనుంది. ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ సంస్థ 2017లో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమిలు ఏర్పాటు చేసేందుకు ఎంఎస్ ధోనీతో ఒప్పందం చేసుకుంది. ఫ్రాంఛైజీ ఫీజు, లాభాల్లోని వాటాను ధోనీకి చెల్లించాల్సి ఉంటుంది. అయితే వారు షరతులను పాటించకపోవడంతో ధోనీ వైదొలిగాడు. ఆపై తనకు రావాల్సిన చెల్లింపులపై కోర్టును ఆశ్రయించాడు.
ఈ మేరకు పోలీసులు వారిపై దివాకర్తో పాటు ఆయన భార్య సౌమ్యదాస్పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఇటీవల ఎంఎస్.ధోని తరఫు న్యాయవాది మీడియాకు వెల్లడించారు. ఆర్కా స్పోర్ట్స్ చేసిన మోసం కారణంగా ధోనీ రూ.15కోట్ల మేర నష్టపోయాడని తెలిపారు. అయితే ఆ ఆరోపణలను దివాకర్ తప్పుబడుతూ పరువు నష్టం దావా వేస్తూ కోర్టును ఆశ్రయించారు.