రాష్ట్రంలో మెగా డీఎస్సీని ఫిబ్రవరిలో నిర్వహిస్తామని వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy).. నేడు నల్గొండలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి.. నల్గొండ (Nalgonda) మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడానికి కృషి చేస్తామని తెలిపిన ఆయన.. త్వరలో ఇందిరమ్మ ఇండ్లనిర్మాణం చేపడతామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం హయాంలో డీఎస్సీ (DSC) పరీక్షల్లో అవినీతి, పేపర్ లీక్ లు జరిగాయన్న ఆరోపణలున్న క్రమంలో.. అలాంటి వాటికి చోటు ఇవ్వకుండా.. UPSC తరహాలో గ్రూప్స్ పరీక్షలను నిర్వహిస్తామని వెంకట్ రెడ్డి తెలిపారు.. అలాగే నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామన్నారు. సంక్షేమ పథకాల కోసం ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారులకు అందిస్తామని వెల్లడించారు.
అదీగాక కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇచ్చే అంశంపై క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని కోమటిరెడ్డి తెలిపారు.. మరోవైపు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో కలిసి శివాజీనగర్ సెంటర్ నుంచి పానగల్ రోడ్డు వరకు 90 లక్షల రూపాయల NCAP నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు, NG కళాశాల నుంచి రామగిరి వరకు, కోటి 30 లక్షల రూపాయల నిధులతో విస్తరిస్తున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
పట్టణంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ సెంటర్ ని పరిశీలించిన మంత్రి.. చేపట్టాల్సిన మార్పుల గురించి కలెక్టర్ కి పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో 244 మంది లబ్దిదారులకి కల్యాణలక్ష్మి (Kalyan Lakshmi) చెక్కుల పంపిణి చేశారు.. నల్గొండ ప్రజలు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి నాపై పెద్ద బాధ్యత పెట్టారని ఈ సందర్భంగా పేర్కొన్నారు..