విజయనగరం జిల్లాలో బుధవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. శృంగవరపు కోట మండలం చిట్టెంపాడులో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో భార్య మృత దేహాన్ని ఓ భర్త బైక్ పై కొంతదూరం, మరికొంత దూరం కావడితో స్వగ్రామానికి తరలించాడు. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కలిచి వేస్తోంది.
వివరాల్లోకి వెళితే…. చిట్టెంపాడుకు చెందిన మాదల గంగన్న, గంగమ్మలకు ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. అకస్మాత్తుగా వారి కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చికిత్స నిమిత్తం ఆయన్ని విశాఖ ఆస్పత్రికి తరలించాలనుకున్నారు. కానీ కొండ కింద ఉన్న గ్రామం దబ్బగుంట వరకు రహదారి సౌకర్యరం లేదు.
ఈ నేపథ్యంలో అతి కష్టం మీద కుమారున్ని డోలిలో కింద గ్రామం వరకు చేర్చి అక్కడ నుండి విశాఖ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంగన్న కుమా రుడు ఆస్పత్రిలోనే మృతి చెందాడు. కుమారుడి మృతి విషయాన్ని తెలుసుకున్న తల్లి గంగమ్మ కన్నీరు మున్నీరయ్యారు. ఈ క్రమంలో ఆమె అనారోగ్యానికి గురయ్యారు.
వెంటనే గంగన్న తన భార్యను తీసుకుని కావడి సహాయంతోనే చిట్టెంపాడు నుండి కొండ దిగువన ఉన్న దబ్బగుంట వరకు చేర్చి అక్కడ నుండి విశాఖ ఆసుపత్రికి తరలించారు. గంగమ్మ కూడా చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించింది. వారం రోజుల వ్యవధిలో భార్య, కుమారుడు మరణించడంతో గుండెలు అవిసేలా రోదించాడు. ఇక చేసేదిలేక గంగమ్మ మృతదేహాన్ని విశాఖ ప్రైవేట్ ఆస్పత్రి నుండి స్వగ్రామానికి తరలిం చేందుకు సిద్ధమయ్యాడు.
భార్య మృత దేహాన్ని ఎస్ కోట వరకు ఆటోలో తీసుకెళ్ళాడు. అలా మృతదేహాన్ని ఎస్కోటలో దించి అక్కడ నుండి ఆటో డ్రైవర్ వెనుతిరిగాడు. ఎస్ కోట నుండి కొండ దిగువన ఉన్న దబ్బగుంట వరకు మరో ఆటోలో తరలించేందుకు గంగన్న వద్ద డబ్బులు లేవు. దీంతో స్నేహితుడి బైక్ పైనే కూర్చోబెట్టి నానా అవస్థలు పడుతూ కొండ దిగువన ఉన్న దబ్బగుంటకు మృతదేహాన్ని తరలించాడు.
అనంతరం అక్కడ నుండి కొండ మీద ఉన్న తన స్వగ్రామమైన చిట్టెంపాడుకు కావడి సహాయంతో గంగమ్మ మృతదేహాన్ని ఇంటికి తరలించాడు. గంగన్న కష్టాన్ని చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. గంగన్న భార్య మృతదేహాన్ని బైక్ పై తరలిస్తుంటే స్థానికులందరూ ప్రేక్షక పాత్ర పోషించారే తప్పా ఏ ఒక్కరూ మానవత్వంతో సహాయం చేసేందుకు ముందుకు రాలేదు.
పూర్తి కథనం…