– కరీంనగర్ నుంచి ఈసారి ఈటలకు ఛాన్స్..!?
– ఒకే దెబ్బకు రెండు పిట్టల ఆలోచనలో హైకమాండ్
– కరీంనగర్ తోపాటు మరో కీలక స్థానంపై ఫోకస్
– అక్కడి నుంచి బండిని బరిలోకి దింపే అవకాశం
– రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ
కరీంనగర్ (Karimnagar) ఎంపీగా పోటీ చేయాలనుందని బీజేపీ (BJP) నేత ఈటల రాజేందర్ (Eatala Rajender) చేసిన కామెంట్ పార్టీలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అక్కడ బండి సంజయ్ (Bandi Sanjay) ఎంపీగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈటల అయితే.. పోటీ చేసిన రెండు చోట్లా పరాజయం చూశారు. కానీ, ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటి రాజకీయ రేసులో ముందుకు రావాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అధిష్టానం అవకాశం ఇస్తే కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పినట్టుగా అనుకుంటున్నారు. నిజంగా.. ఈ స్థానం ఈటలకు ఇస్తే బండి సంగతేంటి..? హైకమాండ్ వేరే ప్లాన్ లో ఉందా?
మల్కాజ్ గిరి అంటూ ప్రచారం
ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ మల్కాజ్ గిరి నుంచి పోటీ అంటూ ప్రచారం జరిగింది. ఇదే సమయంలో ఆయన పార్టీ మారబోతున్నారని, కాంగ్రెస్ గూటికి చేరి మరో చోట నుంచి ఎంపీగా బరిలో ఉంటారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ వార్తలకు తెర దించుతూ.. కరీంనగర్ నుంచి పోటీకి ఆయన ఆసక్తిని కనబరుస్తున్నారు. కానీ, అంతా అధిష్టానంపై తోసేస్తూ.. పోటీకి సై అంటున్నారు.
ప్రచారానికి ప్లాన్ చేసుకున్న బండి
ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా కొనసాగుతున్నారు బండి సంజయ్. మరోసారి విజయఢంకా మోగించాలని తెగ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే బూత్ లెవల్ మీటింగ్స్ నిర్వహిస్తూ.. కార్యకర్తలతో ఓ భారీ సమావేశానికి ఇప్పటికే స్కెచ్ వేశారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు సంజయ్. ఇలాంటి టైమ్ లో తనకు అవకాశమిస్తే కరీంనగర్ నుంచి పోటీ చేస్తానని ఈటల చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
హైకమాండ్ ప్లాన్ ఇదేనా?
బీజేపీకి జాతీయస్థాయిలో తలనొప్పిగా మారారు అసదుద్దీన్ ఒవైసీ. చీటికి మాటికి ఏదో ఒక అంశంపై వివాదాన్ని తెరపైకి తెస్తూ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒవైసీకి చెక్ పెట్టేందుకు మాస్ లీడర్ అయిన బండి సంజయ్ ను బరిలోకి దింపాలని హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే, ఈటల ధైర్యంగా కరీంనగర్ నుంచి పోటీకి సై అన్నారని అంటున్నారు రాజకీయ పండితులు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో సంజయ్ చేసిన పాదయాత్ర అటు కమలం శ్రేణుల్లో ఇటు ప్రజల్లో గుర్తింపు తీసుకొచ్చింది. అదీగాక, ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే పాతబస్తీ గడ్డపై భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన తెగింపును చూసిన అధిష్టానం.. ఈసారి హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి బండిని నిలపాలని ఆలోచిస్తున్నట్టుగా అంచనావేస్తున్నారు. ఒవైసీ గడీలను బండి తన పదునైన మాటలతో బద్దలు కొడతారనే భావనలో హైకమాండ్ నమ్ముతున్నట్టుగా చెబుతున్నారు.