ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM) నారాయణ స్వామి (Narayana Swamy) వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తనకు టికెట్ రాకపోతే ఆత్మాభిమానాన్ని చంపుకొని జ్ఞానేందర్ రెడ్డితో కలిసి పనిచేసేది లేదని తేల్చేశారు. కాపాడుకోవడానికి తనకేం ఆస్తులు, అంతస్తుల లేవని.. తనెవరికీ భయపడాల్సిన అవసరం లేదంటూ మండలనేతల సమావేశంలో నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
డిప్యూటీ సీఎం నారాయణస్వామి చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి ఈసారి నారాయణరావుకు బదులుగా జ్ఞానేందర్ రెడ్డికి అధిష్టానం టికెట్ నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుత్తూరు నివాసంలో ఆరు మండలాల నాయకులతో గురువారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం ప్రధాన్యతను సంతరించుకుంది.
ఆరు మండలాల నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను నారాయణస్వామి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో కొందరు నేతలు నారాయణస్వామి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. టికెట్ ఇవ్వకపోతే కలిసి పనిచేసేది లేదంటూ తెగేసి చెప్పారు. డిప్యూటీ సీఎం అయిన నారాయణస్వామి పక్కన కుర్చీవేసుకుని దర్జాగా కూర్చునే స్వేచ్ఛ ఉందని, జ్ఞానేందర్ రెడ్డి దగ్గర ఆ పరిస్థితి ఉందని వైసీపీ నేతలు వాపోయారు.
అయితే, నారాయణ స్వామికి టికెట్ ఇవ్వకపోతే తమకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పని లేదని స్థానిక నేతలు, ఆయన అభిమానులు అంటున్నారు. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. జ్ఞానేందర్ రెడ్డితో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెబుతుండడంతో ఈ నియోజకవర్గంలో రాజకీయ చర్చ తారాస్థాయికి చేరుకుంది.