ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) ఈ సారి కూడా ఈడీ (ED) విచారణకు గైర్హాజరు అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈడీ నోటీసులకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమాధానం ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తాను నిందితునిగా లేనని వెల్లడించారు. అలాంటప్పుడు ఈ కేసులో తనకు నోటీసులు ఎందుకు జారీ చేశారని ఈడీకి సీఎం కేజ్రీవాల్ లేఖ రాసినట్టు ఆప్ వర్గాలు వెల్లడించాయి.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా తమ అధినేత, సీఎం అరవింద్ కేజ్రివాల్‌ను అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆప్ ఆరోపించింది. ఈ కేసులో కేజ్రీవాల్ నిందితుడు కాదని ఈడీనే స్వయంగా చెప్పిందని తెలిపింది. మరి ఎందుకు ఈడీ నోటీసులు పంపుతోందని ప్రశ్నించింది. గత వారం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు పంపింది.
ఈ కేసులో ఇప్పటికే ఆయనకు ఈడీ నాలుగు సార్లు సమన్లు పంపింది. కానీ ఆయన మూడు సార్లు ఈడీ విచారణకు హాజరు కాలేదు. తాజాగా ఈ రోజు ఈడీ విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ రోజు కూడా ఆయన విచారణకు డుమ్మా కొట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఆయన మూడు రోజుల గోవా పర్యటనకు వెళ్లాల్సి ఉంది.
పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌తో కలిసి ఈ రోజు ఆయన గోవా బయల్దేరి వెల్లనున్నారు. అక్కడ నిర్వహించే లోక్ సభ సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. ఈడీ నాల్గవ సారి సమన్ల విషయాన్ని మీడియా ప్రస్తావించగా దానికి కేజ్రీవాల్ బదులిస్తూ….. ఈ విషయంలో చట్టం ప్రకారం ఏమి చేయాలో తాము అది చేస్తామని పేర్కొన్నారు.