అయోధ్య(Ayodhya) అక్షింతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని బీజేపీ ఎంపీ(BJP MP) బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. రాముడి అక్షింతలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు కరీంనగర్లోని శివాలయాన్ని ఈ రోజు తెల్లవారుజామున ఆయన శుభ్రం చేశారు.
అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. పొన్నం ప్రభాకర్ మంత్రి హోదాలో ఉండి అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం అంటూ ఎగతాళి చేయడం పద్ధతి కాదన్నారు. అక్షింతలు అంటే ఏమిటో.. వాటి ప్రాముఖ్యత ఏమిటనేది ఆయన తన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవాలని సూచించారు.
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశంలోని ఆలయాలను శుద్ధి చేస్తున్నామన్నారు. అయోధ్య అక్షింతల పంపిణీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందని గుర్తుచేశారు.. అక్షింతలను రేషన్ బియ్యం అనే వారికి వాటి ప్రాముఖ్యత, పవిత్రత తెలియదన్నారు. అక్షింతల గురించి కామెంట్లు చేస్తే వారి ఇంట్లో వారే మంత్రికి అక్షింతలు వేస్తారని బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఎంతో ప్రాముఖ్యం ఉన్న అయోధ్య అక్షింతల గురించి తెలియకుండా రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై కాంగ్రెస్ రాజకీయం చేయడం తగదని బండి సంజయ్ హితవుపలికారు. హిందువుల చిరకాల వాంఛ ఈ నెల 22వ తేదీన నెరవేరబోతోందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువుల సహకారంతో దివ్యమైన, భవ్యమైన రామాలయ నిర్మాణం పూర్తయిందన్నారు.