పోలీసులు నిబంధనలకు లోబడి పని చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి(Gandra Venkata Ramanareddy) సూచించారు. తెలంగాణ భవన్(Telangana Bhavan)లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని గండ్ర ఆరోపించారు.
రామాలయం కట్టిన భక్త రామదాసుకే కష్టాలు తప్పలేదని, ప్రభుత్వ భూమిలో గుడి కట్టిన తమపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తారేమోనని వ్యాఖ్యానించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏది చెబితే అది చేయడం సబబు కాదన్నారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని హామీల అమలును కాలయాపన చేస్తున్నారు.
సాక్షాత్తూ తనపై, కుటుంబ సభ్యులపై ఒక రౌడీ షీటర్‌తో ప్రైవేట్ ఫిర్యాదు ఇప్పించి కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. ఆలయం కడితే స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో నోటీసులు ఇచ్చారని హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నామని తెలిపారు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఆర్ అండ్ బీ అతిథి గృహం, ఆలయం అన్నీ ఒకే సర్వే నంబర్లో ఉన్నాయని తెలిపారు.
గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదన్నారు. గుడిని ఆనుకునే ఆలయ అవసరాల కోసం కాంప్లెక్స్ కట్టామని, అది ఆలయం ఆస్తి తప్ప నా సొంత ఆస్తి కాదని స్పష్టం చేశారు.