హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో వందల కోట్ల అభివృద్ధి పనులపై నీలినీడలు కమ్ముకొన్నాయి. జీహెచ్ఎంసీ (GHMC) ఖజానాలో సరిపడా నిధులు లేకపోవడంతో గుత్తేదారులు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. గత ఏడాది నుంచి పనులు చేస్తున్న గుత్తేదారులకు జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించడం లేదన్న సంగతి తెలిసిందే..
ఈ క్రమంలో కొత్త టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదంటున్నారు. జీహెచ్ఎంసీలోని 6 సర్కిళ్లలో దాదాపు రూ.1100 కోట్లకుపైగా గుత్తేదారులకు బకాయిలు చెల్లించాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది.. అయితే గతంలో బకాయిల కోసం గుత్తేదారులు ధర్నా చేస్తే రూ.300 కోట్ల వరకు విడుదల చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ రూ.6వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందనే ఆరోపణలున్నాయి. ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని టాక్ నడుస్తోంది.
ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో సంవత్సర కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న తమ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు నేడు దోమలగూడ (Domalguda) ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ‘‘వి వాంట్ పేమెంట్‘‘ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైఠాయించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు మాట్లాడుతూ గత సంవత్సరం మార్చి నుంచి ఇప్పటివరకు తమ బిల్లులు వేల కోట్లలో పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఆర్సీ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు తాము చేపట్టిన పనులకు సైతం బిల్లులు చెల్లించలేదని ఆరోపించారు.. ప్రభుత్వ తీరువల్ల తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఇక గత ప్రభత్వ హయాంలో చేసిన పొరపాట్లు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం మెడకు గుదిబండలా మారిందని అనుకొంటున్నారు..