తెలంగాణ (Telangana) ప్రజలకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందనే ఆరోపణలున్న నేపథ్యంలో ఆ గాయాలను మాన్పడానికి రేవంత్ సర్కార్ తీవ్రంగా కృషి చేస్తుందని ఇప్పటికే కాంగ్రెస్ (Congress) మంత్రులు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే.. అయితే బీఆర్ఎస్ (BRS) నేతలు తీవ్రమైన విమర్శలు చేస్తున్న చలించకుండా ప్రభుత్వ పాలనలో తనదైనా ముద్ర కనిపించేలా రేవంత్ రెడ్డి (Revanth Reddy) చర్యలు తీసుకొంటున్నట్టు తెలుస్తోంది.
ఇందులో భాగంగా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంపై కీలక నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరైన తెలంగాణ సీఎం.. అక్కడ నిర్వహించిన సదస్సులో హెల్త్ కేర్ డిజిటలీకరణ అంశంపై ప్రసంగించారు. తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజానీకానికి డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని ప్రకటించారు.
అయితే అత్యుత్తమ వైద్యసేవలకు, సాఫ్ట్వేర్ సేవలకు నిలయంగా హైదరాబాద్ మారిందని.. కానీ ఇక్కడ నాణ్యమైన వైద్య సేవలు పొందడం చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో, ప్రజలందరికీ ఉత్తమ వైద్య సేవలు అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33 శాతం హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయని స్పష్టం చేసిన సీఎం.. డిజిటల్ ఆరోగ్య కార్డుల డేటా భద్రత, ప్రైవసీని కాపాడుతామని తెలిపారు.
ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యుత్తమ సాంకేతికత సాయంతో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.. తాజాగా పేదలందరికీ ఉచిత హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.