నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని వాదించినట్టు ఉందని బీఆర్ఎస్ (BRS) నేతల తీరు చూస్తున్న వారు అనుకొంటున్నారు.. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒకే రాగాన్ని ఎత్తుకొన్న గులాబీ పక్షులపై ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న రాష్ట్ర ప్రజలు.. వీరి తీరుకు విసుగు చెందుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదనే వాయిస్ వినిపిస్తూ.. పార్లమెంట్ ఎన్నికల్లో సానుభూతి పొందాలని చూస్తున్నా, ప్రజలు నమ్మే స్థితిలో లేరనే నిజాన్ని గ్రహిస్తే మంచిదని అంటున్నారు..
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు.. కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని ఆరోపించారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే కేవలం ఆరు నెలల్లో ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.. మహబూబ్ నగర్ (Mahbub Nagar) పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
రైతుబంధు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల సంఖ్య సరిగ్గా 420 ఉన్నాయని ఎద్దేవా చేశారు.. నాలుగు కోట్ల మంది ఉన్న తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కి తక్కువ వచ్చిన ఓట్లు కేవలం నాలుగు లక్షలు మాత్రమేనని గుర్తు చేశారు.. మళ్ళీ గట్టిగా పోరాడితే అధికారంలోకి రావడానికి ఎక్కువ సమయం పట్టదని సూచించారు..
ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు నెరవేర్చే వరకు గుర్తు చేయాలని.. అవసరం అనుకొంటే పోరాటం చేయాలని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పై జరిగిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వైఫల్యం చెందినట్టు తెలిపారు.. బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం అయినట్టు కేటీఆర్ పేర్కొన్నారు.. ఇచ్చిన మాట తప్పుతోన్న కాంగ్రెస్ (Congress) ప్రభుత్వానికి ముందు ముందు తిప్పలు తప్పవని జోస్యం చెప్పారు..