– కేసీఆర్ జాతీయ రాజకీయాలపై నీలినీడలు
– ఒక్కొక్కరుగా జంప్ అవుతున్న నేతలు
– మహారాష్ట్రలో అంతా రివర్స్
– ఏపీలో అంతా సైలెంట్
– ఒడిశాలో ఉన్న ఒక్కగానొక్క లీడర్ కూడా జంప్
తెలంగాణలో కారు జోరు తగ్గిపోతుందని భావిస్తున్న సమయంలో.. జాతీయ రాజకీయాల్లో సైతం ఇదే టాక్ వినిపిస్తోంది. అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి అన్న తీరు బీఆర్ఎస్ పరిస్థితికి సూట్ అయ్యిందని అనుకొంటున్నారు. మనం తప్ప వేరే దిక్కులేదని, అసలు ఇంతకాలం పాలించిన నేతలకు పాలన చేయడం తెలియదని భావించిన గులాబీ బాస్.. పలు రాష్ట్రాలలో బీఆర్ఎస్ బ్రాంచీలు ఓపెన్ చేసి.. తమ ప్రతిభ చూపిద్దామని గతంలో భావించారు. కానీ, మితిమీరిన విశ్వాసం అనర్థాలకు మూలం అని, వేల పుస్తకాలు చదివిన మేధావి గుర్తించలేకపోయారనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది.
హడావుడిగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ శాఖను ఏర్పాటు చేసి, కమిటీలను నియమించిన బీఆర్ఎస్ ఆ తరువాత అటు వైపు కన్నెత్తి చూసింది లేదు. ఒక్క కార్యక్రమం నిర్వహించిన దాఖలాలు లేవు. కానీ, అప్పట్లో పార్టీలో చేరే వారిని వాహనాలు పంపి మరీ హైదరాబాద్ కు తీసుకొచ్చి, ఓ కండువా కప్పేసి ఆ తరువాత వారి విషయాన్ని విస్మరించారు. అలాగే, ఒడిశాలో కూడా పేరున్న కొందరు నేతలను చేర్చుకొని హంగామా చేశారు.
తెలంగాణలోనే కాదు.. ఇతర రాష్ట్రాలలో సైతం బీఆర్ఎస్ పాలన నచ్చి పార్టీలోకి వస్తున్నారని ప్రచారం సైతం నిర్వహించుకొన్నారు. నిజానికి, ఒడిశా నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారు సామాన్యులేం కాదు.. మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్. వీరిలో గిరిధర్ గమాంగ్ ఏకంగా తొమ్మిది సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆయన తన కుమారుడితో కలిసి బీజేపీని వీడి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ గూటికి చేరారు.
తాజాగా ఈయన బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ గూటిలో వాలారు. ఇటు మహారాష్ట్రలో పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. కర్ణాటకలో అయితే ఎటువంటి ప్రణాళికలు లేవు. ప్రస్తుతానికి తెలంగాణలో పట్టు నిలుపుకోవాలనే బీఆర్ఎస్ తాపత్రయపడుతోంది. మొత్తానికి లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ జాతీయ రాజకీయాల అంశం హాట్ టాపిక్ గా మారింది.