తెలంగాణ (Telangana) రాజకీయాల్లో రేవంత్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారా? అనే అనుమానాలు మొదలైయ్యాయి.. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదనే ప్రచారాన్ని బీఆర్ఎస్ (BRS) నేతలు చేయడం.. వారి గోతి వారే తవ్వుకున్నట్టు అయ్యిందని అనుకొంటున్నారు.. రేవంత్ రెడ్డిని అంచనా వేయడంలో గులాబీ నేతలు తొందరపడుతున్నట్టు.. అసలు దారి తప్పినట్లు అనుకొంటున్నారు..
టీడీపీ వీడాక కాంగ్రెస్ నీడలో చేరిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రస్థానం సరిగా స్టడీ చేయని బీఆర్ఎస్ నేతలు.. ఒక్కసారి రేవంత్ గతాన్ని పరిశీలించి అడుగులు వేస్తే బాగుండుందని కొందరు భావిస్తున్నారు.. ఎందుకంటే.. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో 49 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్.. అంతటి ఘనమైన చరిత్ర ఉన్న జాతీయ పార్టీలోకి సాధాసీదాగా ఎంట్రీ ఇచ్చిన రేవంత్.. అతి తక్కువ కాలంలో సీఎం అవడం అనేది మామూలు విషయం కాదని అంటున్నారు..
అలాంటి వ్యక్తిని తక్కువగా అంచనా వేసిన బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం ఆడుతున్న మైండ్ గేమ్ వారికే తిప్పికొట్టిందనే టాక్ వినిపిస్తుంది. ఇందుకు కారణం లేకపోలేదు.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎంఐఎంతో దోస్తీ కట్టి కీలుబొమ్మలా మారిందనే ఆరోపణలున్నాయి.. అయితే అధికారం కోల్పోయాక అదే పార్టీ అండ చూసుకొని కాంగ్రెస్ కు చెక్ పెడదామని భావించిన కారు పార్టీకి సొట్టపడేలా రేవంత్ షాకిచ్చారని అనుకొంటున్నారు..
మూసీ నదిని థేమ్స్ లా మార్చే అంశంపై అధ్యయనం చేద్దామని రేవంత్ రెడ్డి పిలవగానే మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ లండన్ లో దిగిపోయారు. ఇద్దరూ కలిసి ఫోటోలు దిగి మీడియాకు పంపారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న మైండ్ గేమ్ పాలిటిక్స్ లో కొత్త కోణం ఆవిష్కృతమయింది. ప్రభుత్వం కూలిపోతుందంటూ కామెంట్లు చేస్తున్న వారికి ఇది ఓ హెచ్చరికగా మారింది. అయితే దీని వెనుక రాజకీయం లేదా అంటే.. ఎక్కువ రాజకీయం ఉందనే అనుకోవాలి. ఎందుకంటే రాబోయేది పార్లమెంట్ ఎన్నికల సీజన్ మరి.
అంతరించిపోతున్న పార్టీల జాబితాలో బీఆర్ఎస్ చెరబోతుంది అనే ప్రచారం జరుగుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డితో అక్బరుద్ధీన్ భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్, ఎంఐఎంలు పరస్పరం కలిసి నడుస్తాయన్న చర్చలకు పునాది పడింది. ఇకపోతే ప్రస్తుతం అసెంబ్లీలో 119స్థానాల్లో కాంగ్రెస్‌కు 64, మిత్రపక్షం సీపీఐకి 1 స్థానం, ఎంఐఎంకు 7, బీజేపీకి 8, బీఆరెస్‌కు 39స్థానాలున్నాయి. బీఆరెస్, బీజేపీలు ప్రభుత్వాన్ని పడగొట్టే క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైనా చేజారినా రేవంత్ ప్రభుత్వం మైనార్టీలో పడే అవకాశముంది. అలాంటి పరిస్థితుల్లో ఎంఐఎం మద్దతు కీలకంగా మారనుంది.