కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) గంగుల కమలాకర్(Gangula Kamalakar) అన్నారు. కరీంనగర్(Karimnagar)లో బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడుతామన్నారు.
‘నాలుగుసార్లు వరుసగా నన్ను గెలిపించారు.. ఈ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు పాదాభివందనాలు చేస్తున్నా.. అత్యంత గట్టి పోటీ నడుమ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ నాలుగోసారి నన్ను గెలిపించడం సాధారణ విషయం కాదు.. బండి సంజయ్ లాంటి జాతీయ స్థాయి నేత, కాంగ్రెస్ వాగ్దానాలు ఉన్నప్పటికీ నేను గెలవడం అత్యంత సంతోషకరం..’ అని గంగుల అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు ఏం చేసిందో చెప్పాలన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన వాళ్లు ఇప్పుడు లోన్లు కట్టాలంటూ నోటీసులు పంపుతున్నారని ఆరోపించారు. ఇంతవరకు రైతు బంధు ఎవరికీ రావడంలేదన్నారు. వరి పంట వేయొద్దని అంటున్న వారు బోనస్ ఎలా ఇస్తారు..? అని ప్రశ్నించారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తామన్న రుణమాఫీ హామీ ఏమైందని గంగుల ప్రశ్నించారు.
45 రోజుల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని ఎమ్మెల్యే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల వల్ల కొన్ని చోట్ల ఓడిపోయామని, కేసీఆర్పై వ్యతిరేకత లేదన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని, ఇక్కడ కాంగ్రెస్కు ఓటు బ్యాంకు లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు చేసేవరకు కొట్లాడతామని గంగుల స్పష్టం చేశారు.