అయోధ్య(Ayodhya)లో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరామచంద్రుడికి దేశవిదేశాల నుంచి కానుకలు అందుతున్నాయి. ఎంతోమంది విరాళాల రూపంలో ఆలయ నిర్మాణంతో తమవంతు సాయాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ 14ఏళ్ల బాలిక ‘ఉడతా భక్తి’ని చాటింది.
రామమందిర నిర్మాణానికి ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.52లక్షల విరాళాలను సేకరించింది. చిన్న వయసులో అంత నగదును సేకరించిన బాలికపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సూరత్(Surath)కు చెందిన భవికా మహేశ్వరి(Bhavika Maheshwari) రామాయణం మీద ఉన్న ఆసక్తితో బాలరాముడి కథలు చదవడం ప్రారంభించింది.
ఆ కథలను కొవిడ్ సెంటర్లు, బహిరంగ సభల్లో ప్రజలకు విడమరిచి చెప్పింది. 2021లో ఓ జైలులో ఉన్న ఖైదీలకు రాముడి కథలను చెప్పగా వారు రూ.లక్ష విరాళం ఇచ్చారు. అలా భవికా తాను 11ఏళ్ల వయసు నుంచి 50వేల కిలోమీటర్లు ప్రయాణించి 300కు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. వాటి ద్వారా మొత్తంగా రూ.52లక్షల వరకూ సేకరించింది. ఆ నగదును అయోధ్య రామాలయం నిర్మాణానికి అప్పగించింది.
భవికా మహేశ్వరి మాట్లాడుతూ.. ‘‘శ్రీరాముడికి సాయం చేయడానికి ఉడత ముందుకు వచ్చినట్లే.. నేనూ రామ మందిర నిర్మాణానికి నావంతు సాయం చేశాను. ఇలా చేయడానికి నేను నా తల్లిదండ్రుల నుంచి ప్రేరణ పొందాను. చిన్నప్పటి నుంచి రామాయణం చదివేదాన్ని. ఎన్నో తరాల వారు రామ మందిరాన్ని చూడలేకపోయారు. కానీ భవ్య రామ మందిరం మా తరంలో రూపు దిద్దుకుంటోంది. ఇది మా అదృష్టం.’’ అని తెలిపింది.