హిందువుల ఐదు వందల ఏండ్ల కల నెరవేరింది. అయోధ్య (Aydohya)లో శ్రీ రామ జన్మభూమిలో నిర్మించిన ఆలయాన్ని ప్రధాని మోడీ (PM Modi) ప్రారంభించారు. ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని చెక్కిన కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగీ రాజ్ అయోధ్యకు చేరుకున్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్బంగా అరుణ్ యోగిరాజ్ ఆనందంలో మునిగి పోయారు. ఈ భూమిపై తనంత అదృష్టవంతుడు ఉండరని తెలిపారు. తన పూర్వీకుల, కుటుంబ సభ్యుల, ఆ రామ్ లల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ తన వెంటనే ఉంటాయని చెప్పారు. ఆ భగవాన్ శ్రీ రాముడు ఎల్లప్పుడూ తన వెంటే ఉన్నట్టు అరుణ్ పేర్కొన్నారు.
కొన్ని సందర్భాల్లో తాను ఒక ఊహా ప్రపంచంలో ఉన్నట్లు తనకు అనిపిస్తోందని యోగిరాజ్ తెలిపారు. రామ మందిర ప్రారంభోత్సవానికి దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా అయోధ్యలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక రామ మందిర ప్రారంభోత్సవం సందర్బంగా దేశమంతా రామ నామాలతో మార్మోగి పోతోంది.
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు స్థానిక ఆలయాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అంతకు ముందు రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతోన్న వేళ ప్రధాని మోదీ భావొద్వేగానికి గురయ్యారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠతో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుందని వెల్లడించారు.