తెలంగాణ (Telangana)లో అధికారం కోల్పోయాక ఇన్ని రోజులకు బీఆర్ఎస్ (BRS) ముఖ్య నేతలు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు గెలుపు తమ ఖాతాలో వేసుకొని.. ఓటమికి మాత్రం గులాబీ నేతలను కారకులుగా పేర్కొంటూ విమర్శలు చేసిన చిన్నసారు.. ఇప్పుడిప్పుడే అసలు విషయాన్ని గమనించినట్టు మాట్లాడటం.. అందులో పెద్ద సారు సైతం క్యాడర్ చేయి జారిపోకుండా ముందస్తు చర్యలు చేపట్టడం.. భవిష్యత్తులో బీఆర్ఎస్ కనుమరుగు కాకుండా చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలో బీజేపీ (BJP) నేత రఘునందన్ రావు (Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.. అధికారం కోల్పోయాక కార్యకర్తలు గుర్తొచ్చారా అంటూ ఎద్దేవా చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉద్యమకారులకు సీట్లు ఇస్తామంటోన్న కేటీఆర్ (KTR).. ముందుగా తన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. శంకరమ్మ విషయంలో ఇచ్చిన మాట గుర్తు లేదా? అని ప్రశ్నించారు. అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి అసలైన ఉద్యమకారులకు అవకాశం ఇస్తామని ప్రమాణం చేయండని డిమాండ్ చేశారు.
తెలంగాణా సమాజం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని బొంద పెట్టిందని విమర్శించిన రఘునందన్ రావు.. త్యాగం చేసిన కుటుంబాలకు రాజకీయాల్లో అవకాశం ఇస్తామని చెప్పే దమ్ము, దైర్యం బీఆర్ఎస్‌కు ఉందా? అని నిలదీశారు. త్యాగాలు ఒకరివి.. భోగాలు మీవా అని మండిపడ్డారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడికి అప్పనంగా భూములు అప్పగించి అధ్యక్షుడిని చేశారని ఆరోపించారు..
మల్లన్న సాగర్, పోచమ్మసాగర్‌తో బీఆర్ఎస్ వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించిన రఘునందన్ రావు.. కల్వకుంట్ల కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకొని వేల కోట్లు సంపాదించుకొన్నారు. కానీ రాష్ట్రం కోసం త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను మాత్రం రోడ్డున పడేశారని మండిపడ్డారు. మొదట శంకరమ్మ, ఎర్రోళ్ల శ్రీనివాస్ లాంటి వాళ్లకు సీట్లు ఇవ్వాలని హితవు పలికారు. చేతులు కాలాక ఆకులు పట్టుకొంటే ఏం లాభం అని ఎద్దేవా చేశారు.