ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలు పట్టించుకుంటే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ముందుకు సాగవని ఐటీ మంత్రి(IT Minister) శ్రీధర్‌బాబు(Sridhar Babu) అన్నారు. మంగళవారం ఆయన అధ్యక్షతన టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒక మంచి మేనిఫెస్టో అందించగలిగామని వెల్లడించారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు ఇచ్చామని వాటి అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన రెండో రోజే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీలో రూ.10లక్షల ఆరోగ్య పథకాన్ని అందించామని తెలిపారు.
ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఎంతో విశ్వాసాన్ని చూపారని, ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయన్నారు. వారు చేస్తున్న విమర్శలను పట్టించుకుంటే పనులు జరగవని అభిప్రాయపడ్డారు. అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తామన్నారు.
ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్చార్జి దీపదాస్ మున్శి , ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీ ఖాన్, ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.