హైదరాబాద్(Hyderabad)లో వరుస అగ్ని ప్రమాదాలు(Fire accident) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తెలంగాణ సచివాలయం(Telangana Secretariat) సమీపంలోగల మింట్ కాంపౌండ్(Mint Compund) లోని ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదం బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పెద్దఎత్తున మంటలు చెలరేగుతూ దట్టమైన పొగలు కార్యాలయం నుంచి బయటకు రావడాన్ని స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది.
అయితే, ఈ అగ్నిప్రమాదంలో ప్రింటింగ్ ప్రెస్‌లోని పుస్తకాలు, ముద్రణా యంత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. వాటి విలువ లక్షల్లో ఉంటుందని అంచనా. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
అయితే, హైదరాబాద్‌లో ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటుడటం పలు అనుమానాలకు తావిస్తోంది. మింట్ కాంపౌండ్ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎవరైనా కావాలని చేశారా? లేక విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమా? అనేదానిపై విచారణ చేపట్టారు.