– అనుభవం ఉందని నియమిస్తే ఆగం చేశారు
– 1049 మంది రీ రిక్రూట్ మెంట్ లో 200 మంది అక్రమార్కులే
– కేసీఆర్, కేటీఆర్ డిపార్ట్ మెంట్లలోనే అధిక అక్రమాలు
– పక్కదారి పట్టిన వేల కోట్లు
– అన్నీ బయటకు రావాలంటే ఏసీబీని దింపాలంటున్న ఉద్యోగులు
– డిపార్ట్ మెంట్ల వారీగా విచారణ జరపాలని డిమాండ్
– కొత్త ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుందా?
– landsandrecords.com పరిశోధనాత్మక కథనం
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత కేసీఆర్ ప్రభుత్వంపై ఎన్నో ఆరోపణలు చేసింది కాంగ్రెస్. రాష్ట్రాన్ని నాశనం చేశారని.. సలహాదారులు, రిటైర్డ్ అధికారులతో లూటీ చేస్తున్నారని విమర్శల దాడి చేసింది. అయితే.. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. మరి, ఆనాటి విమర్శలకు ఇప్పుడు చర్యలు తీసుకుంటుందా? అనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. ఈ క్రమంలోనే రిటైర్డ్ అయిన వారిని రీ రిక్రూట్ మెంట్ చేసుకుని సాగించిన పాలనపై, జరిగిన అవినీతిపై landsandrecords.com పరిశోధనాత్మక కథనాన్ని ఇచ్చింది.
200 మంది అవినీతిపరులు
బీఆర్ఎస్ పాలనలో రిటైర్డ్ అయిన 1049 మందిని తీసుకొచ్చి అక్షరాలా వెయ్యి కోట్ల రూపాయలు జీతాలు ఇచ్చారు. ప్రభుత్వంలోని పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, పార్టీ కార్యకర్తలకు ఏం కావాలో అది జబర్దస్త్ గా రూల్స్ , చట్టాలు ఫాలో కాకుండా వారితో చేయించుకున్నారు. రీ రిక్రూట్ మెంట్ అయిన 1049 మందిలో 200 మంది అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పని లీగల్ గా చేస్తారని అనుభవం ఉన్నవారిని తెచ్చి పెట్టుకుంటే.. అవినీతికి పాల్పడటమే కాకుండా పనులు చట్టపరంగా చేయలేదట. అందినకాడికి దోచుకోవాలని దొపిడీ ముఠాలా మారారనే విమర్శలు ఆయా శాఖల్లో వినిపిస్తున్నాయి. రిటైర్డ్ అయ్యాం.. తమపై ఏం చర్యలు ఉంటాయని అనుకున్నారో ఏమో.. ఉద్యోగం చేసినన్ని రోజులు సంపాదించలేని ఆస్తులు గత ఐదేళ్లలో సంపాదించారని అనుకుంటున్నారు ఉద్యోగులు. నీటిపారుదల ఈఎన్సీలు, హెచ్ఎండీఏ, మున్సిపాల్టీల్లో ఉన్న అధికారులు తరాతరాలకు తరగని ఆస్తులను సంపాదించారట. తమ వారికే కాంట్రాక్టులు ఇచ్చి , కాంట్రాక్ట్ బేసిక్ లో ఉద్యోగాలు ఇప్పించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఒకరిని చూసి మరొకరు అక్రమంగా ఎన్నో ఫైల్స్ క్లియర్ చేశారని అనుకుంటున్నారు.
అడుగడుగునా నిర్లక్ష్యం
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెలన్నరే అయింది. సీఎం, మంత్రులు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టి.. సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఓ అవగాహనకు వస్తున్నారు. పాలనపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఈ గ్యాప్ లో కొందరు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. హైదరాబాద్ లోని కేటీఆర్ చేసిన శాఖలో అధికారులు పనులు చేయడం లేదట. అసలు, అభివృద్ది ఊసే లేకుండా వారికి నచ్చిన సమయానికి వస్తూ, వెళ్తూ ఉన్నారని మిగిలిన ఉద్యోగులు అంటున్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, జలమండలిలో ఈ వ్యవహారం కనిపిస్తోంది. ఫీల్డ్ లోకి వెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయో చూడాల్సిన డిప్యూటీ కమిషనర్స్ వెళ్లడం లేదట. రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నా వాటిపై దృష్టి పెట్టడం లేదని అంటున్నారు. ఇదే అదునుగా వందలాది అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. నెలన్నరగా ఎక్కడికక్కడ పాలన పడకేసినట్టుగా విమర్శలు వస్తున్నాయి. పన్నులు వసూలు చేయాల్సిన అధికారులు చేయడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకా రెండు నెలలే సమయం ఉంది. 2,100 కోట్లకు గాను 1,300 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. బడాబాబులు, రాజకీయ నాయకులే ఇంకా చెల్లించలేదు. వారికి నోటీసులు ఇచ్చేందుకు కూడా సిబ్బంది వెనకడుగు వేస్తున్నారు. ఈ అంశంపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని అంటున్నారు మిగిలిన ఉద్యోగులు.
రిటైర్డ్ ఈఎన్సీల నుంచి ఔట్ సోర్సింగ్ దాకా అక్రమాలే!
చీఫ్ ఇంజినీర్స్, ఐఎఏస్ లాంటి పోస్టుల్లో, కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన స్థానాల్లో రిటైర్డ్ అయి రీ రిక్రూట్ చేసుకున్న వారిని తీసుకోవడంతోనే అధిక తప్పులు జరిగాయి. నీటిపారుదల శాఖలో మురళీధర్ రావు తన కుమారుడైన అభిషేక్ కి కాంట్రాక్టులు ఇప్పించుకున్నారు. వెంకటేశ్వర్లు, హరిరాం సిద్దిపేట జిల్లాలో భూములు కొనుగోలు చేశారు. టీఎస్పీఎస్సీలో జనార్ధన్ రెడ్డి, స్త్రీ నిధి ఎండీగా విద్యసాగర్ రెడ్డి, ఆర్టికల్చర్ డైరెక్టర్ గా వెంకట్రామిరెడ్డి, పశువుసంవర్ధక శాఖలో వంగాల లక్ష్మారెడ్డి, ఎండీసీలో ఆర్ కృష్ణమూర్తి, చివరికి మర్రి చెన్నారెడ్డి ఇన్ స్టిట్యూట్ లో ప్రకాశ్ రావు అనే 72 ఏండ్ల అధికారి నెలకు 2 లక్షలు అక్రమంగా సంపాదించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఔట్ సోర్సింగ్ లో ఉన్న సిటీ ప్లానర్స్ కూడా భారీగా లాగారు. అత్యంత కాస్ట్లీ ఏరియా అయిన శేరిలింగంపల్లిలో ముగ్గురు సిటీ ప్లానర్స్ కాంట్రాక్ట్ బేసిక్ లో చేరారు. ఇలా బాధ్యత లేకుండా అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై landsandrecords.com వరస కథనాలు ఇవ్వనున్నట్టు తెలిపింది. మరి.. రేవంత్ రెడ్డి సర్కార్ ఈ అక్రమార్కులపై ఫోకస్ పెట్టి చర్యలు తీసుకుంటుందా?