రాజధాని అమరావతి(Amaravathi) కోసం 1500 రోజులుగా నియంతపై పోరాడుతున్న రైతులకు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఉద్యమాభివందనాలు తెలిపారు. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. వారి ఆశయం త్వరలోనే నేరవేరుతుందని లోకేష్ వ్యాఖ్యానించారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. అధర్మంపై ధర్మం విజయం సాధిస్తుందని లోకేష్ అన్నారు. రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు, దళిత, బహుజన బిడ్డలు ఏకమై మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని సాగిస్తూనే ఉన్నారని తెలిపారు.
పోలీసుల నిర్బంధాలు, లాఠీల కరాళ నృత్యాలు, దేహాలపై రక్తమోడుతున్న గాయాలు ఏవీ వారి పోరాట పటిమను దెబ్బతీయలేకపోయాని తెలిపారు. అందుకే ఆ మహోద్యమం మరిచిపోలేని విజయాలతో ముందుకు సాగిపోతోందన్నారు. దేశ చరిత్రలో సుదీర్ఘ సమరశీల పోరాటంగా నిలిచిపోయిందని వ్యాఖ్యానించారు.
ఏపీ సరికొత్త రాజధాని అమరావతిని నాశనం చేస్తూ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసింది మొదలు రాజధాని రైతులు ఉద్యమానికి దిగారు. అయితే, వారి ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు భగ్నం చేసేందుకు సర్కారు చేయని ప్రయత్నం లేదు. ఇప్పటి వరకూ 2600 మందిపై 600కు పైగా కేసులు బనాయించారు. నాలుగేళ్లలో 250 మంది రైతులు గుండె పోటుతో మృతిచెందారు.
ఉద్యమం ఊపిరిపోసుకుందిలా..
రాజధాని అమరావతి నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వానికి 29 గ్రామాల పరిధిలో ఉన్న 34,322 ఎకరాల భూములను 29,881 మంది రైతులు భూ సమీకరణ కింద ఇచ్చారు. వారిలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. కానీ 2019, డిసెంబరు 17న సీఎం జగన్ శాసన సభలో చేసిన మూడు రాజధానుల ప్రకటన రాజధాని వాసులను కుదిపేసింది. ఆ మరుసటి రోజే రాజధాని ఉద్యమం ఊపిరిపోసుకుంది.