గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను గురువారం ప్రకటించింది. అందులో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)కి పద్మవిభూషణ్(Padmavibhushan) అవార్డుకు ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkat Reddy) ఇవాళ ఉదయం చిరంజీవి ఇంటికి వెళ్లిన స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవికి శాలువాకప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. చిరంజీవి సందేశాత్మక సినిమాలు తీశారని అన్నారు. తాను యువకుడుగా ఉన్నప్పుడు చిరంజీవి సినిమాలను చూసేవాడినని మంత్రి గుర్తుచేసుకున్నారు.
ఉత్తమ నటుడైన చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు పొందడం గర్వకారణమన్నారు. ఆయనకు భారత రత్నతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు పద్మవిభూషణ్ వరించడం తెలుగువారికి గర్వకారణమన్నారు.
అదేవిధంగా మెగాస్టార్‌కు అభినందనలు తెలుపుతూ పలువురు సినీ ప్రముఖులు ఎక్స్‌లో వరుస పోస్టులు పెడుతున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు పోస్ట్ చేస్తూ.. ‘బాలరాముడి దర్శనం అయ్యాక అత్యున్నత అవార్డు దక్కడం ఆనందంగా ఉంది. మీ విషయంలో ఎప్పటికీ గర్వపడుతూ ఉంటా.. కంగ్రాట్స్..’ అని పేర్కొన్నారు.
దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేస్తూ ‘ పునాదిరాళ్లు సినిమాతో నటుడిగా తొలి అడుగు వేసిన సాధారణ కుర్రాడు పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైనందుకు హృదయపూర్వక అభినందనలు’ అని రాసుకొచ్చారు. అదేవిధంగా హీరో రవితేజ.. ‘కంగ్రాట్స్ అన్నయ్యా.. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ అని ట్వీట్ చేశాడు.