తెలంగాణ భవన్ (Telangana Bhawan)లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న మాజీ హోంమంత్రి మహమూద్ అలీ (Mahmood Ali) అస్వస్థతకు గురయ్యారు. కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేస్తున్న సమయంలో కిందపడిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆయనకు ప్రాథమిక చికిత్స నిర్వహించారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
మరోవైపు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్, సామాజిక ఉద్యమంలో పాల్గొన్న సత్యనారాయణకు రాజకీయ నేపథ్యం అడ్డంకి అయితే ఎన్నికల్లో పోటీచేసిన కోదండరాంను ఏరకంగా ఆమోదించారో గవర్నర్ ప్రజలకు వివరించాలన్నారు. తన పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీకి ఉన్న ఫెవికాల్ బంధం మేరకు నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించిన కేటీఆర్.. ఈ నామినేషన్ల అంగీకారం కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కును తెలియజేస్తుందని పేర్కొన్నారు. బీజేపీ జాకీలు పెట్టి కాంగ్రెస్‌కి మద్దతుగా నిలుస్తున్నదని విమర్శించారు. సర్పంచుల పదవీకాలం పొడిగించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక ఇన్‌చార్జీలను పెట్టద్దన్నారు. చేతనైతే ఎన్నికల్లో ఇచ్చిన 420 అమలుపర్చాలని కేటీఆర్ సూచించారు.
రాజకీయాల్లో ఇలాంటి కుసంస్కారం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు తప్పవన్నారు. ప్రజల దృష్టిని మరలచే ప్రయత్నాలు ఎన్ని చేసినా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేవరకు వెంటాడుతామని స్పష్టం చేశారు. ఒకటే రోజు రాజీనామా చేసిన ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదించారు. ఒకటే కోటా కింద ఉన్న ఎమ్మెల్సీలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహించారని విమర్శించారు.
మరోవైపు భారత రిపబ్లిక్ డే (Republic Day) వేడుకలు శుక్రవారం దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీ (Delhi)లో గణతంత్ర ఉత్సవం అంబరాన్నంటింది. కర్తవ్యపథ్‌లో దేశ ప్రథమ మహిళ ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.