దేశ రాజధాని ఢిల్లీలో 75వ గణతంత్ర వేడుకల (Republic Day)ను ఘనంగా నిర్వహించారు. కర్తవ్య పథ్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సైనిక గౌరవ వందాన్ని ఆమె స్వీకరించారు. ఈ సారి గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి సాంప్రదాయ గుర్రపు బండిలో కర్తవ్యపథ్‌కు ఆయన చేరుకున్నారు.
సుమారు 40 ఏండ్ల తర్వాత ఈ సాంప్రదాయాన్ని మరోసారి ప్రారంభించారు. మరోవైపు రిపబ్లిక్ డే వేడుకలకు ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఇతర కేంద్రమంత్రులు హాజరయ్యారు. అంతకు ముుందు ఢిల్లీలోని వార్ మెమోరియల్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరులకు ప్రధాని మోడీ వందనం చేశారు.
జాతీయ పతాక ఆవిష్కరణ తర్వాత పరేడ్, శకటాల ప్రదర్శనను నిర్వహించారు. మొదట ఆవాహన్‌తో పరేడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది సాంప్రదాయ బ్యాండ్ స్థానంలో శంఖం, నాదస్వరం, నగారాలతో ప్రదర్శన చేశారు. ఎంఐ-17 హెలికాప్టర్ల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ధ్వజ్ ఆకృతిలో చేసిన విన్యాసాలు హైలెట్ గా నిలిచాయి.
ఈ వేడుకల్లో చరిత్రలో తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన నారీమణులు మన సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆత్మ నిర్బరత, నారీ శక్తి థీమ్‌తో నౌకదళం రూపొందించిన శకటం అందరినీ ఆకట్టుకుంది. మరోవైపు గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ సైన్యం, సైనిక బ్యాండ్ అందరికి కనువిందు చేసింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో పాటు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు ఫ్రెంచ్ సైన్యం గౌరవ వందనం సమర్పించింది.
75వ గణతంత్ర వేడుకల సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్రమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత బలమైన, సంపన్న భారత దేశాన్ని నిర్మించేందుకు అంతా కలిసి పని చేద్దామని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ అన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో విరాజిల్లే దేశం భారత్ అని పేర్కొన్నారు.
జాతీయ నాయకుల స్ఫూర్తితో ప్రజలంతా ముందుకు సాగాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకు, వీర సైనికులందరినీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సందర్బంగా స్మరించుకున్నారు. ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో ప్రజాస్వామ్య విలువలను రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేద్దామన్నారు.