ఏలూరు జిల్లా(Eluru District) ద్వారకా తిరుమల(Dwarka Tirumala) మండలం దేవినేనివారి గూడెం(Devineni’s home)లో పులి(Tiger) సంచారం హడాలెత్తిస్తోంది. అర్ధరాత్రి వేళలో గ్రామంలోని రెండు ఆవులు, ఒక దూడపై పులి దాడి చేసింది. తెల్లవారుజామున పొలంలోకి వెళ్లిన రైతులు గాయపడిన ఆవులు, పులి పాదముద్రలు గుర్తించారు. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దెందులూరు, ద్వారకాతిరుమల, నల్లజర్ల మండలాల్లో పులి ఎక్కువగా సంచరిస్తోంది. వారం రోజులుగా బుట్టాయిగూడెం, నల్లజర్ల, ద్వారకాతిరుమల, దెందులూరు మండలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం. నిన్న దెందులూరు మండలం మేదినరావుపాలెంలో పులి పాదముద్రలను రైతులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం నల్లజర్ల మండలం పుల్లలపాడులో ఆవు దూడలపై పులి దాడి చేసింది. ద్వారకాతిరుమలలో మండలంలో ఆవులపై దాడి చేసి తినేసింది.
13 సెంటీమీటర్ల పైగా పాదముద్రలు ఉంటే పులి సంచరిస్తున్నట్లని అధికారులు చెబుతున్నారు. అయితే, ఒక్కోచోట ఒక్కోరకంగా పులి పాదముద్రలు.. సంచరించేది పెద్దపులి ఒక్కటేనా.. రెండా అనే అనుమానం పులి కదలికలను గుర్తించేందుకు ఇప్పటికే అటవీశాఖ అధికారులు ఆరు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రోజుకు 40 కిలోమీటర్ల పరిధిలో పులి సంచారం కొనసాగడంతో బోను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు.
పులి సంచారంతో స్థానిక ప్రజల్లో భయాందోళన నెలకొంది. పొలాలకు వెళ్లాలంటే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పులిని త్వరగా బంధించాలని అధికారులను కోరుతున్నారు. పులి సమాచారం కోసం అటవీ సిబ్బంది టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు.పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల పాక దగ్గర వెలుతురు ఎక్కువ వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.