ఢిల్లీ (Delhi)ని దట్టమైన పొగ మంచు (Smoke Snow)కమ్మేసింది. కాలుష్యానికి తోడు పొగ మంచు అలుముకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్ (Punjab), ఉత్తరప్రదేశ్(Uttar Pradesh), హర్యానా (Haryana)లోని పలు నగరాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. కాగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని.. గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు పొగ మంచు ప్రభావంతో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. క్యాట్ -3 టెక్నాలజీ లేని విమానాలపై పొగ మంచు ప్రభావం పడుతోంది. ఢిల్లీ వాయు నాణ్యత 328 పి.ఎం.తో వెరీ పూర్ కేటగిరికి చేరింది. కాలుష్యం, పొగ మంచుతో ప్రజలకు అనారోగ్య సమస్యలు తెలుత్తుతున్నాయని ఇక్కడి వైద్యులు వెల్లడిస్తున్నారు.. అదీగాక చలితీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున అనవసరంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వృద్ధులు, చిన్నపిల్లలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని పేర్కొన్నారు. ఇక CAT III లేని విమానాలు ప్రభావితం కావచ్చని విమానయాన అధికారులు తెలిపారు. సమాచారం కోసం ప్రయాణికులు సంబంధిత ఎయిర్‌లైన్‌ను సంప్రదించాలని కోరారు. అసౌకర్యం ఏర్పడనున్న నేపథ్యంలో విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో పొగమంచు విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలు ఉదయం బయటకు రావాలంటేనే భయపడి పోతున్నారు.
అదీగాక వాహనదారులు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. పట్టపగలే హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం తొమ్మిది గంటలయినా పొగమంచు వీడటం లేదు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రోజు వారీ పనులకు ఆటంకం కలుగుతుందని వాహనదారులు వెల్లడిస్తున్నారు. ఇక వాతావరణ కారణంగా ఢిల్లీలోని పలు వీధులు నిర్మానుష్యంగా మారాయి..