ఇన్నాళ్లు టీడీపీ(TDP)లో ఉండి వైసీపీ(YCP)లోకి వెళ్లిన కేశినేని నాని ఇటీవల చంద్రబాబు (Chandrababu)పై కీలక వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే తనతో పోటీ చేయాలంటూ ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేశినేనిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న (TDP Leader Budda Venkanna) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… కేశినేని నాని టీడీపీలో సంసారం చేస్తూ వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారి అంటూ ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి కేశినేని నాని అని అన్నారు. టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయనతో కలిసి పని చేసిందే లేదన్నారు. వైసీపీ నాయకులతో మాత్రం చాలా దగ్గరగా కలిసి నడిచారన్నారు. ఎప్పటి నుంచో ఈ కోవర్టు రాజకీయాలకు నాని తెర లేపారని ఆరోపించారు.
చంద్రబాబు దగ్గర మాట్లాడిన మాటలను విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డికి చేరవేశారన్నారు. ప్రజల కోసం పోరాడే తనలాంటి వ్యక్తులపై చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారన్నారు. దీనికి ప్రత్యక్ష సాక్షి సుజనా చౌదరి అని తెలిపారు. కేశినేని నాని టిక్కెట్ తీసుకోక ముందే బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారన్నారు. చంద్రబాబు తనపై నమ్మకంతో వారి మాటలను నమ్మలేదన్నారు.
చంద్రబాబు, లోకేష్‌ను వేరే వాళ్ల దగ్గరకు వెళ్లి తిట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గం ఇన్‌చార్జిగా తనను చంద్రబాబు నియమించినట్లు చెప్పారు. దుర్గగుడి ఫ్లైఓవర్ కోసం తాను ఎన్నో పోరాటాలు చేశానని తెలిపారు. తర్వాత నాని పార్లమెంట్ ఇన్‌చార్జి అయ్యాక తనను తొలగించాలని అధిష్టానానికి చెప్పారని ఆరోపించారు. ఇలాంటి కుట్రలు చేస్తూ పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టారని విమర్శించారు.