తెలంగాణ (Telangana)లో సీనియర్ రాజకీయ నేత అనగానే గుర్తొచ్చే పేరు వీహెచ్.. అలియాస్ వి హనుమంత రావు (V Hanumantha Rao).. కాంగ్రెస్ (Congress)లో సుదీర్ఘ కాలంగా ఉంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు, ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. విద్యార్థి నాయకుడి నుంచి మొదలైన ఆయన ప్రస్థానం.. పీసీసీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా.. ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.
ఏడు పదుల వయసులోనూ ఇంకా యాక్టివ్ గా రాజకీయాల్లో ఉంటూ.. ప్రత్యర్థులపై ఘాటు విమర్శలతో విరుచుకుపడుతుంటారు. ప్రత్యర్థి పార్టీ నేతలనే కాదు.. తప్పు చేస్తే సొంత పార్టీ నేతలను కూడా ఏమాత్రం వెనకాడకుండా బహిరంగంగానే కడిగేయటమే వీహెచ్ ప్రత్యేకత.. అలాంటి హన్మంతుకు, సౌత్ వెస్ట్ జోన్ DCP సాయి చైతన్య (Sai Chaitanya) కోపం తెప్పించారనే వార్త చక్కర్లు కొడుతోంది.
నేటి ఉదయం లంగర్ హౌస్ (Langar House), బాపుఘాట్‌లో, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వీహెచ్ వచ్చారు. అంతకు ముందు ఆయన మహాత్మా గాంధీ సమాధి వద్దకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతలు పెరిక రాజు, పరమానందంతో పాటు మరో వ్యక్తి అక్కడికి వచ్చారు. అయితే వారిని డీసీపీ లోపలికి అనుమతించలేదు. దీంతో కాంగ్రెస్ నేతలు వీహెచ్‌కు ఫోన్లో సమాచారం ఇచ్చారు..
వెంటనే పోలీసుల వద్దకు చేరుకొని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా గవర్నమెంటులో మమ్మల్ని ఆపుతావా రా భాయ్ నువ్వు.. అంటూ సాయి చైతన్యపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికి కూడా వారిని లోపలికి అనుమతించకపోవడంతో వీహెచ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం కొంత సమయం తర్వాత పోలీసులకు ఫోన్ రావడంతో వారిని లోపలికి అనుమతించారు.