రాష్ట్రంలో నకిలీ పాస్ట్ పోర్టుల కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా మరో అధికారి అరెస్ట్ అయ్యారు. నిజామాబాద్ (Nizamabad) జిల్లా మాక్లూర్, నవీపేట ఎస్బీ ఏఎస్ఐ లక్ష్మణ్‌ను తెల్లవారుజామున సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఇప్పటికే నకిలీ పాస్ పోర్టుల కేసులో నిందితుడిగా ఉన్న సుభాష్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు అతని వద్ద నుంచి ల్యాప్ టాప్, ఇతర విలువైన సమాచారం గల పత్రాలతో పాటు పలు నకిలీ పత్రాలను సైతం స్వాధీనం చేసుకొన్న విషయం తెలిసిందే.
మరోవైపు నకిలీ పాస్ పోర్టు స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సీఐడీ (CID) అధికారులు.. ఇప్పటికే పెద్ద మొత్తంలో శ్రీలంక (Sri Lanka)కు నకిలీ పాస్ పోర్టులు తీసుకువెళ్లినట్లు గుర్తించారు. హైదరాబాద్ (Hyderabad) రీజనల్ పాస్ పోర్టు కేంద్రంగా మొత్తం 92 పాస్ పోర్టులు జారీ అయినట్లు కనుగొన్నారు. అయితే ఈ స్కాంలో కొంతమంది పోలీసు అధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఇప్పటికే 14 మంది నిందితులను అరెస్టు చేశారు.
తమిళనాడుకి చెందిన ఏజెంట్ మురళీధరన్ ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా అధికారులు నిర్ధారించారు. అయితే శ్రీలంక దేశస్థులు ఎక్కువ మంది అడ్డదారిలో పాస్ పోర్టులు పొందారని, తెలంగాణ (Telangana) సీఐడీ అడిషనల్ డీజీ షికా గోయల్ తెలిపారు. హైదరాబాద్ కు చెందిన సత్తార్, తమిళనాడుకు చెందిన మురళీధరన్ నకిలీ పాస్ పోర్టులు సృష్టించి.. మొత్తం స్కాంను నడపారన్నారు. మరోవైపు కరీంనగర్ ,హైదరాబాద్ నుంచి కూడా ఎక్కువగా పాస్ పోర్టులు పొందినట్లు గుర్తించామని వెల్లడించారు.
కొందరు విదేశీయులకు నకిలీ ఐడీ ప్రూఫ్ పెట్టి పాస్ పోర్టులు ఇప్పించినట్లు గుర్తించామన్నారు. 92 మంది ఇలా నకిలీ పాస్ పోర్టులు పొందారని వివరించారు. పాస్ పోర్టులు ఇప్పించడంలో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారుల హస్తం ఉన్నట్లు గుర్తించి వారిని కూడా అరెస్ట్ చేశామని తెలిపారు. పలువురు ఎస్బీ, పాస్ పోర్ట్ సిబ్బంది పాత్రపై ఆరా తీస్తున్నామన్నారు. మొత్తానికి గతంలో బోధన్ కేంద్రంగా రోహింగ్యాల పాస్ పోర్టుల వ్యవహారంతో పాటు ఇతర నకిలీ పత్రాలు, పాస్ పోర్టుల జారీ వ్యవహారంలో పాలు పంచుకొన్న అధికారులు, ఎజెంట్లు అందరి బాగోతం బయట పడ్డట్లు తెలుస్తోంది.