కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కారుపై దాడి జరిగింది. బెంగాల్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra) చేస్తుండగా ఆయన కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. కతిహార్‌లోని డీఎస్ కళాశాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడిలో రాహుల్ గాంధీ కారు వెనుక అద్దం ధ్వంసమైంది. ఈ ఘటనలో రాహుల్ గాంధీకి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలోకి ప్రవేశించగానే రాహుల్ గాంధీ కారుపై రాళ్ల దాడి జరిగిందని కాంగ్రెస్ చెబుతోంది. హరిశ్చంద్రపూర్ ప్రాంతానికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాహుల్ గాంధీ కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేశారని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి వెల్లడించారు. ఈ దాడిలో రాహుల్ గాంధీ వెనుక అద్దం పగిలిందని వివరించారు.
ఇలాంటి దాడులు ఆమోద యోగ్యం కాదని అన్నారు. రాహుల్ గాంధీ భయపడే వ్యక్తి కాదని చెప్పారు. ఈ దాడి వెనుక తృణమూల్ కాంగ్రెస్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. దాడి జరిగినప్పుడు భద్రతా దళాలు పట్టించుకోలేదని పేర్కొన్నారు. అందుకే ఇలాంటి ఘటన జరిగిందని ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీకి ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు మమతా బెనర్జీ కూడా మాల్దాలోనే ఉండటం గమనార్హం. సీఎం మమతా బెనర్జీ ఈరోజు ‘జోనోసంజోగ్ యాత్ర’ చేస్తున్నారు. యాత్రలో భాగంగా కాంగ్రెస్ పై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను రాజకీయాల కోసం చాలా అరుదుగా వస్తానని అన్నారు. కానీ కొన్ని పార్టీలు ఎన్నికల సమయంలో కోకిలల్లాగా కిలకిలాలు ప్రారంభిస్తాయని ఎద్దేవా చేశారు. బీజేపీతో తమ పోరాటం కొనసాగుతుందని చెబుతాయన్నారు. బీజేపీని ఓడించగలిగిది టీఎంసీ మాత్రమేనన్నారు.