Telugu News » Telangana : పరువు నష్టం.. మాటల యుద్ధం..!

Telangana : పరువు నష్టం.. మాటల యుద్ధం..!

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపిక విషయంలో మాణిక్యం ఠాగూర్ పై బీఆర్ఎస్ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. రూ.50 కోట్లకు అమ్మేశారని అన్నారు. దీంతో ఆయన పరువు నష్టం నోటీసులు పంపిస్తున్నారు.

by admin
KTR VS Manickam Tagore

– కేటీఆర్ కు పరువు నష్టం నోటీసు
– 7 రోజుల్లో వివరణ ఇవ్వాలన్న మాణిక్కం ఠాగూర్
– పీసీసీ పదవి చుట్టూ రగిలిన వివాదం
– రేవంత్ రెడ్డికి అమ్మేశారని బీఆర్ఎస్ నేతల ఆరోపణలు
– మాణిక్కం నోటీసుపై కేటీఆర్ కౌంటర్
– కోమటిరెడ్డి వ్యాఖ్యల్నే చెప్పానన్న మాజీ మంత్రి
– ముందు నోటీసు ఆయనకు పంపాలని సూచన
– ఇప్పటికే ఈ కేసులో మదురై కోర్టుకు హాజరైన కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి

మాణిక్కం ఠాగూర్ (Manickam Tagore).. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్. కానీ, తెలంగాణ (Telangana) రాజకీయాల్లో ఈయన పేరు అప్పుడప్పుడూ మార్మోగుతుంటుంది. గతంలో టీపీసీసీ ఇంఛార్జ్ గా పని చేయడమే అందుకు కారణం. ఆ సమయంలో ఒంటెద్దు పోకడలతో వ్యవహరించారని.. టీపీసీసీ చీఫ్ పదవిని అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి. కొందరు నేతలు కాంగ్రెస్ (Congress) ను వీడుతూ ఠాగూర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఆ తర్వాత ఈయన్ను ఇంఛార్జ్ పదవి నుంచి తప్పించింది హైకమాండ్. మాణిక్కం ప్లేస్ లో మాణిక్ రావు థాక్రే వచ్చారు. అందరూ కలిసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే.. తనపై బీఆర్ఎస్ (BRS) నేతలు చేసిన విమర్శలను సీరియస్ గా తీసుకున్న ఆయన.. పరువు నష్టం దావా వేస్తూ వస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కు కూడా నోటీసు పంపారు.

KTR VS Manickam Tagore

‘కొడుకు’ అని అంటూ నోటీసులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ ను ‘కొడుకు’ అని సంబోధిస్తూనే మాణిక్కం ఠాగూర్ షాక్ ఇచ్చారు. పరువు నష్టం నోటీసు పంపినట్టు తెలిపారు. కేటీఆర్ తన ఫాంహౌస్‌ లో ఉల్లాసంగా గడుపుతూ ఉండొచ్చు కానీ.. 7 రోజుల్లో నోటీసుపై స్పందించాలని సెటైర్లు వేశారు. కేటీఆర్ 7 రోజుల్లో స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపిక విషయంలో మాణిక్యం ఠాగూర్ పై బీఆర్ఎస్ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. రూ.50 కోట్లకు అమ్మేశారని అన్నారు. దీంతో ఆయన పరువు నష్టం నోటీసులు పంపిస్తున్నారు.

మాణిక్కం నోటీసులపై కేటీఆర్ రిప్లై

మీడియాలో వచ్చిన రూ.50 కోట్ల లంచం వార్తలనే తాను ప్రస్తావించానని కేటీఆర్ రిప్లై ఇచ్చారు. బుధవారం ఎక్స్ (ట్విట్టర్) లో ఠాగూర్‌ పై మండిపడ్డారు. ఆయన అయోమయంలో ఉన్నారన్నారు. తన తోటి కాంగ్రెస్ నాయకుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే రేవంత్ రెడ్డి మీకు రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నారని చెప్పిన మాట గుర్తు చేశానని చెప్పారు. కోమటిరెడ్డి మీపై చేసిన ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదన్నారు. తాను చేసిన రూ.50 కోట్ల లంచం వ్యాఖ్యల‌పైన వివరణ కూడా ఇవ్వలేదని చెప్పారు. మీ పరువు నష్టం నోటీసు కోమటిరెడ్డికి కూడా పంపిస్తే బాగుంటుందని సూచించారు. తన చిరునామాకు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న ఆయన కార్యాలయానికి పంపించండని సెటైర్లు వేశారు కేటీఆర్.

ఇప్పటికే కోర్టుకు హాజరైన కౌశిక్, సుధీర్

ఇలాంటి ఆరోపణలకు సంబంధించి.. ఇప్పటికే ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి కోర్టుకు వెళ్లారు. వారికి వారెంట్ జారీ కావడంతో జనవరి పదో తేదీన మదురై కోర్టుకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అప్పట్లో మాణిక్కం ఠాగూర్ ఎక్స్ (ట్విట్టర్ ) లో పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు తనపై చేసిన తప్పుడు ఆరోపణల మీద మదురై కోర్టులో పరువు నష్టం కేసు వేశానని.. తనపై వచ్చిన ప్రతి ఆరోపణ పైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇదే క్రమంలో కేటీఆర్ నోటీసు పంపారు.

You may also like

Leave a Comment