హైదరాబాద్ (Hyderabad)లో పెరుగుతున్న ట్రాఫిక్ (Traffic)ను నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి (Revanth Reddy).. పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ నగరంగా అభివద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో.. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసిన సీఎం.. ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు మూడు నెలల్లో హోంగార్డులను నియమించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఇతర విభాగాల్లో పని చేస్తున్న హోంగార్డులను వెనక్కి పిలిచి వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులను కూడా ట్రాఫిక్ నియంత్రణ విధులకు వినియోగించుకోవాలని సూచించిన రేవంత్ రెడ్డి.. సిటీలో రహదారులు, జంక్షన్ల విస్తరణపై దృష్టి పెట్టాలని తెలిపారు. ముఖ్యంగా ఎల్బీనగర్ జంక్షన్ తరహాలో సబ్ వే, అండర్ పాస్, సర్ఫేస్ వే నిర్మాణాలు చేపట్టే అవకాశాలను రద్దీ ఎక్కువగా ఉండే కూడళ్లలో పరిశీలించాలని పేర్కొన్నారు.
ఆటోమేటిక్ సిగల్ వ్యవస్థ మీద పూర్తిగా ఆధారపడకుండా, ప్రధాన జంక్షన్ల వద్ద సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మూడు కమిషనరేట్ల పోలీస్ అధికారులు, మున్సిపల్ జోనల్ కమిషనర్లు ప్రతినెలా సమావేశమై ట్రాఫిక్‌పై సమీక్షలు జరపాలని.. ఇబ్బందులున్న ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్టీ లెవల్ పార్కింగ్ కేంద్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించేలా ప్రత్యేక పార్కింగ్ పాలసీని రూపొందించాలని వెల్లడించారు.
లే అవుట్లకు హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చేటప్పుడు రోడ్లు, పార్కులు, మౌలిక వసతులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ట్రాఫిక్ నిర్వహణ, వసతులపై దేశంలోని ఇతర నగరాలు, విదేశాల్లో ఎలాంటి పద్దతులను అనుసరిస్తున్నారనే విషయంపై అధ్యయనం చేయాలన్నారు. మరోవైపు ఈ సమీక్షకు సీఎస్ శాంతికుమారి (CS Shanthi Kumari), డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.