తెలంగాణ (Telangana) వ్యాప్తంగా గ్రామ సర్పంచుల ఐదేళ్ల పదవీకాలం నేటితో ముగిసింది. దీంతో ప్రభుత్వఆదేశాలతో ఆయా పంచాయతీల్లో ప్రత్యేకాధికారులను నియమించేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. అయితే గత డిసెంబరులో రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించినప్పటికీ కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఇందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు.
దీంతో రాష్ట్రంలో ప్రత్యేకాధికారుల పాలన అనివార్యమైంది. శుక్రవారం నుంచి పంచాయతీల్లో ప్రత్యేకాధికారులు పాలన కొనసాగించే అవకాశముందని సమాచారం.. కానీ ఇందుకు సమ్మతించని సర్పంచులు ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకూ తమనే పదవిలో కొనసాగించాలని కోరుతున్నారు. లేదా పెండింగ్‌లో ఉన్న బిల్లులు మంజూరు చేసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన అమలు చేయాలని పట్టుబడుతున్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం కొనసాగింపు ఉండదని ఇప్పటికే తేల్చి చెప్పేసింది. మరోవైపు ఈ అంశంపై స్పందించిన బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).. పదవీకాలం ముంగిచుకొన్న సర్పంచ్‌లకు కీలక సందేశం పంపించారు. సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ.. ప్రజాసేవకు కాదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజానీకానికి ఐదేళ్ల కాలం పాటు సేవ చేసిన గ్రామ సర్పంచులు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని వెల్లడించారు.
మరోవైపు పంచాయతీ ఎన్నికలకు 2019 జనవరి 1వ తేదీన షెడ్యూలు, నోటిఫికేషన్ వెలువడింది. అదే నెలలో 21, 25, 30 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 1వ తేదీన గెలిచిన వారు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇకపోతే 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసేలోపు ఎన్నికలను నిర్వహించాలి కానీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలను నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యేకాధికారుల ద్వారా పంచాయతీ పాలన కొనసాగించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.